తెలంగాణలో సీజనల్ స్వరాలు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య ఎక్కువ కావడం, అక్కడ అరకొర సౌకర్యాలు యథాతథం. ఈ నేపథ్యంలో, భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి సందర్శించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు చేశారు. యాదాద్రిలో శిల్పాలు చెక్కించుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిమగ్నమై ఉన్నారుగానీ, పేదల ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందనీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లూ నర్సుల కొరత తీవ్రంగా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రమంతా జ్వరపీడితమైపోతుంటే కేసీఆర్ సర్కారు కేంద్రంతో బేషజాలకు పోతోందని లక్ష్మణ్ అన్నారు. దేశంలో అన్నిటికన్నా గొప్ప పథకం ఆరోగ్యశ్రీ అని ఇప్పటికీ చెబుతున్నారన్నారు. అంత గొప్ప పథకం అని ప్రచారం చేసుకుంటున్నారుగానీ, ఆరోగ్యశ్రీ పరిధిలో డెంగూ, చికెన్ గున్యా లేవన్నారు. సకాలంలో బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆరోగ్య శ్రీ పథకం కూడా సక్రమంగా పేద ప్రజలకు అందడం లేదన్నారు. అందుకే, ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఈ పథకం కింద చికిత్సలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఉంటోందన్నారు. దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకం కంటే ఎక్కువ వ్యాధులను అందులో పొందుపరిచినా, దాన్ని ప్రజలు అందకుండా కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కొన్ని లక్షమంది ఆయుష్మాన్ భారత్ ని ఉపయోగించుకుంటుంటే, ఇక్కడ మాత్రం ఎందుకు దాన్ని సీఎం అడ్డుకుంటున్నారో అనీ, పేదలకు రోగాలకు వస్తే మరణించాలా అంటూ విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జ్వరాల పరిస్థితిని లక్ష్మణ్ ఇలా, రాజకీయంగా తమకు అత్యంత అనుకూలంగా మార్చుకునే విధంగా విమర్శించారు! ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేయకపోవడం వల్లనే రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందడం లేదన్నట్టు మాట్లాడారు. నిజానికి, ఈ సమయంలో అమల్లో ఉన్నది కేంద్ర పథకమా రాష్ట్ర పథకమా అనే చర్చ పెట్టుకుని విమర్శలు చేయడం సరైందా..? ప్రభుత్వ వైఫల్యాన్ని విమర్శించొచ్చు తప్పులేదు, ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవద్దని ఎవరైన అంటారా? కేంద్రంలో అధికార పార్టీగా ఇలాంటి సమయంలో అత్యవసర వైద్య సేవలు అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యొచ్చు. మొత్తానికి, ఈ సందర్భాన్ని కేంద్ర పథకానికి ప్రచారం కల్పించేందుకు వాడుకున్నట్టుగా కనిపిస్తోంది.