తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ పంచాయితీ షురూ అయింది! ఎంపీ రేవంత్ రెడ్డి ఒక పక్క… సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి ఒక పక్క అన్నట్టుగా కనిపిస్తోంది. రేవంత్ కి పీసీసీ పగ్గాలు వెళ్లిపోతాయేమో అనే ఆందోళనో ఆవేదనో వారిలో కనిపిస్తోంది. అయితే, ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది! రాష్ట్రంలో పార్టీ బలపడే ప్రయత్నంలో ఉంది కదా. రేవంత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ లో ఎంతమంది నాయకులు ఇప్పుడు వెంట నిలుస్తున్నారో తెలీదుగానీ… భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతుండటం విశేషం.
కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డికి నమ్మకం పోయిందన్నారు లక్ష్మణ్! తెరాసతో పోరాడే శక్తి సామర్థ్యాలు కాంగ్రెస్ కి లేవని అర్థమౌతోందన్నారు. తెరాస, కాంగ్రెస్ పార్టీలూ రెండూ లోపయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అందుకే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లలేకపోతోందన్నారు. విద్యుత్ అవినీతికి సంబంధించిన ఆధారాలను తనకు ఇస్తానని రేవంత్ రెడ్డి అన్నారని లక్ష్మణ్ చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరిపి, ఉత్తమ్ ని జైలుకు పంపిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తీరు మీద ఆ పార్టీలో నాయకులకే నమ్మకం లేదనీ, తెరాసతో పోరాడే శక్తి సామర్థ్యాలు తమకు మాత్రమే ఉన్నాయని లక్ష్మణ్ అన్నారు.
రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీలోనే అనుమానాలు రేకెత్తించే ప్రయత్నంగా లక్ష్మణ్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అయితే, కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి మీద ఇష్టం లేదన్నది వాస్తవమే! రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందన్న ప్రచారం మొదలైన తరువాత అయిష్టులు ఎక్కువయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టాలంటే ఎలాంటి నాయకుడి అవసరం ఉందో హైకమాండ్ కి తెలుసు. అయితే, రేవంత్ కి మద్దతుగా, ఆయన సేకరించిన అవినీతికి సంబంధించిన ఆధారాలు తనకు రేవంత్ ఇస్తానని లక్ష్మణ్ అనడాన్ని కాస్త ప్రత్యేకంగానే చూడాలి. తెరాస మీద కాంగ్రెస్ చేయనున్న పోరాటాన్ని ఇప్పట్నుంచే హైజాక్ చేసే పనిలో భాజపా ఉన్నట్టుంది. ఏదేమైనా, కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలకు తెర పడకపోతే… దాన్ని ఏరకంగానైనా భాజపా వాడుకునేందుకు రెడీగా ఉంటుందనడానికి లక్ష్మణ్ వ్యాఖ్యలే ఉదాహరణ.