తెరాస ప్రభుత్వంపై ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తెరాసను వేరే ఎవరు లక్ష్యంగా చేసుకోనక్కర్లేదనీ, ఆ పార్టీలో చాలామంది కట్టప్పలు ఉన్నారని వ్యాఖ్యానించారు. వారే పార్టీని కూలుస్తారన్నారు. అధికార పార్టీలో ఎంతమంది కట్టప్పలు ఉన్నారో తెరాస ఒక్కసారిగా స్వీయ పరిశీలన చేసుకోవాలనీ, నిర్లక్ష్యం వహిస్తే తరువాత చాలా బాధపడాల్సి ఉంటుందని అధికార పార్టీకి సూచించారు. తెలంగాణ ప్రభుత్వ పునాదులు పెకిలించేందుకు నరేంద్ర మోడీ అనే బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తామన్నారు లక్ష్మణ్. ఇందిరా పార్క్ దగ్గర రిటైర్డ్ ఉద్యోగులు నిర్వహించిన సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలివి.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ఒక పరోక్ష విమర్శ చేశారు. ఉద్యోగులు కసాయిని నమ్మినట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్ముతున్నారని లక్ష్మణ్ అన్నారు. వారి సమస్యల్ని పట్టించుకోకపోయినా, డిమాండ్లను తుంగలోకి తొక్కుతున్నా ఎన్నికలు వచ్చాయంటే కేసీఆర్ కే వాళ్లంతా ఓట్లు వేశారన్నారు. ఐదేళ్లపాటు ఉద్యోగుల పక్షాన భాజపా నిలబడిందనీ, కానీ ఉద్యోగులు చివరికి వచ్చేసరికి భాజపాని నమ్మలేదన్నారు. గడచిన ఆరేళ్లలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల్ని ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా అధికార పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులం అని కొంతమంది చెప్పుకుని తిరుగుతున్నారనీ, ఆర్టీసీ కార్మికుల ఉద్యమాన్ని నీరుగార్చింది ఇలాంటివారే అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు తరఫున భాజపా పోరాడుతుందన్నారు.
తెరాస పతనానికి సొంత నేతలే చాలన్నారు లక్ష్మణ్. అయితే, అలాంటి పరిస్థితి తెరాసలో ఎలా ఎక్కడ ఉందో, ఆయన చెబుతున్న కట్టప్పలు ఎవరో కూడా ఇంకాస్త స్పష్టతతో విమర్శిస్తే… లక్ష్మణ్ చెప్పిందాన్లో నిజం ఉందేమో ఆలోచించే అవకాశం ఉంటుంది. సరైన వివరాలు లేకుండా ఇలాంటి కబుర్లు చెబితే, ఇందులో నిజం ఉండదనే అభిప్రాయమే కలుగుతుంది. ఇంకోటి… ప్రభుత్వ ఉద్యోగులు తెరాసకు మద్దతుగా వ్యవహరిస్తున్నారనే అక్కసు వెళ్లగక్కారు. ఒకవేళ ఉద్యోగుల్ని భాజపా వైపు తిప్పుకోవాలంటే ఇలా వారినే తప్పుబట్టినట్టు వ్యాఖ్యానించకూడదు. ఉద్యోగుల తరఫున ఉన్నామనే భరోసా కలిగించే విధంగా వ్యాఖ్యలుండాలి.