ఇది కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందుమాట..! భాజపా జాతీయ నాయకత్వంలో పనిచేస్తున్న కొంతమంది ఏపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు విషయమై చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఆ చర్చ ఏంటంటే… ‘పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే చంద్రబాబుకు ఏం అవసరం..? భాజపాకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ అక్కడి ప్రజలకు పిలుపునిస్తారా..? వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఎలా గెలుస్తుందో అదీ చూద్దాం’.. ఇవే అంశాలపై భాజపా జాతీయ నాయకత్వంలోని కొంతమంది హాట్ హాట్ గా స్పందించారని సమాచారం. కర్ణాటక ఫలితాలు వచ్చాక ఆ సంగతి ఆలోచించొచ్చు అని అనుకున్నారట!
ఇది కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాతి మాట..! మళ్లీ, జాతీయ నాయకత్వంలో కొంతమంది కీలక నేతల మధ్య తెలుగువారి ప్రస్థావన వచ్చిందని తెలుస్తోంది. కర్ణాటకలో మరో ఏడు లేదా ఎనిమిది నియోజక వర్గాల్లో తెలుగువారు సహకరించి ఉంటే భాజపాకి స్పష్టమైన మెజారిటీ వచ్చి ఉండేదనీ, అదే జరిగి ఉంటే సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యేదనే అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లనే ఇలా జరిగిందన్న అభిప్రాయమూ వ్యక్తమై, మరోసారి సదరు భాజపా నేతలు ఏపీ సీఎం మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై భాజపా నేతలు ఎంత అక్కసుతో ఉన్నారన్నది ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొన్ని గంటల్లోనే అర్థమైపోయింది. ఒక దశలో భాజపాకి ఫుల్ మెజారిటీ నంబర్లు కనిపించాయి. తుది ఫలితాలు వెల్లడికాకముందే… చంద్రబాబుపై భాజపా జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ విమర్శలకు దిగేశారు. కర్ణాటకలో చంద్రబాబు ఎన్ని కుయుక్తులు చేసినా భాజపాని తెలుగువారు ఆదరించారని అన్నారు. అక్కడి తెలుగువారు చంద్రబాబు రాజకీయాలను తిప్పికొట్టారన్నారు. ఆయన ఇలా మాట్లాడే సమయానికి భాజపా లీడ్ లో ఉంది. అయితే, తుది ఫలితాలు వచ్చేవరకూ చంద్రబాబుపై ఆగ్రహాన్ని దాచుకోలేకపోయారంటే… భాజపా నేతల అక్కసు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడు నెలలు చాలు.. ఏపీలో గణనీయ రాజకీయ మార్పులు తథ్యమని భాజపా నేతలు ఇప్పటికే కవ్విస్తున్నారు! ఇక, కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో అధికారం ముగింట భాజపా చతికిలపడటానికి కారణం చంద్రబాబు నాయుడే అనే అభిప్రాయం వారిలో ఆగ్రహానికి ఆజ్యం పోసేట్టుగా కనిపిస్తోంది.