శ్రీశైలం ఆలయానికి సంబంధించిన దుకాణాలు అన్య మతస్తులకే కేటాయిస్తున్నారట..! శ్రీశైలం ఆలయ ఈవో రామంచంద్రమూర్తి ముస్లిం అట…! ఇక ఉపేక్షించేది లేదు.. ఆలయాలను అన్యమతస్తులతో నింపేస్తున్నారు…. కాపాడుకోకపోతే.. హిందూత్వ అస్థిత్వానికే ప్రమాదం… చలో శ్రీశైలం అంటూ… బీజేపీ నేత , తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ నేతృత్వంలో నిన్నంతా కొంత మంది హడావుడి చేశారు. దానికి కొంత మంది చోటా స్వాములు జత కలిశారు. ఇంకే ముంది… హడావుడే.. హడావుడి. చివరికి దీనికి ప్రభుత్వం కూడా ఆందోళన చెందింది. అక్కడితో ఏం జరిగిందో.. వివరించడం కన్నా.. అసలు ఆపేస్తే బెటర్ అన్న లొంగుబాటుకు వచ్చేసి.., షాపుల వేలం పాటను రద్దు చేసి.. ఈవోను బదిలీ చేసేసింది.
శ్రీశైలం దగ్గర దుకాణాల వేలం పాటలు సహజం. మూడు రోజుల నుంచి శ్రీశైలం దేవస్ధాన పరిధిలోని లలితాంబికా నూతన షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపులపై వేలం పాటలు జరుగుతున్నాయి. అయితే.. ఇవన్నీ కేవలం.. ఓ వర్గం వారికే దక్కుతున్నాయి. అధికార పార్టీ నేతల అండ ఎవరికి ఉంటే.. వారికే.. షాపులు దక్కుతున్నాయి. ఇతర పార్టీల వారికి వేలంలో పాల్గొనే అవకాశం కూడా రావడం లేదు. అధికార పార్టీ నేతలు.. ఇతర మతస్తులకు కూడా.. షాపులు కట్టబెట్టారు. అక్కడే వివాదం ప్రారంభమయింది. తమ వారికి దక్కడం లేదన్న కసితో… బీజేపీ నేతలు. హిందూత్వ నినాదాన్ని తీసుకు వచ్చారు. అక్కడి బీజేపీ నేతలు.. మొత్తం వ్యవహరాన్ని ఆపేయడానికి.. రాజాసింగ్ ను… హిందూ సంస్థలను రంగంలోకి దింపారు.
రాష్ట్ర స్థాయిలో… హిందూ సంస్థలు, స్వాముల ఆందోళన మారడంతో.. ప్రభుత్వం మెడలు వంచాల్సి వచ్చింది. మొదట్లో ఎలాంటి అవతవకలు జరగడం లేదంటూ అధికారులను వెనకేసుకొచ్చిన సర్కార్.. ఇష్యూ పెద్దది కావడంతో ఊహించని విధంగా యూటర్న్ తీసుకుంది. దుకాణాల వేలం పాటలను రద్దు చేయడంతో పాటు ఆ వెంటనే ఆలయ ఈవోని కూడా బదిలీ చేసింది. మొదటగా దుకాణాల వేలం పాటలు రద్దు చేసినప్పటికి.. ఊహించిన రియాక్షన్ రాకపోవడంతో ఆ వెంటనే ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తిని కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రామచంద్రమూర్తి .. తనకు తాను ఇస్లాం మతంలోకి మారానని గతంలో కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఆయన చేసుకున్న రెండు పెళ్లిళ్లను సమర్థించుకోవడానికి ఇలా చేశారు. ఇదే ఇప్పుడాయన మెడకు చుట్టుకుంది.