తిరుపతి ఉప ఎన్నిక విషయంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టిడిపి బిజెపి వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. 2019 ఎన్నికలలో నోటా తో పోటీ పడ్డ బిజెపికి ప్రస్తుతం జన సేన కూడా తోడై నప్పటికీ గత కొంతకాలంగా జనసేన బిజెపి ల మధ్య గ్యాప్ ఉన్న నేపథ్యంలో దాన్ని సరిచేసే ఉద్దేశం తో బిజెపి నేతలు ఒక అడుగు ముందుకు వేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర అధినేత గా చూడాలనుకుంటున్నాము అని, బిజెపి అందుకు కృషి చేస్తుందని వ్యాఖ్యానించడం నిన్నంతా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం ఈ వ్యాఖ్యలపై ట్విస్ట్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
విష్ణువర్ధన రెడ్డి ఏమన్నారంటే :
బిజెపి నేత , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి అయిన విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, బిజెపి 2019 ఎన్నికల తర్వాత బాగా పుంజుకుందని, తాము నిజంగా బలహీనంగా ఉంటే ఇవాళ వైఎస్సార్ సీపీ టీడీపీ కాంగ్రెస్ పార్టీలు తమను టార్గెట్ చేస్తూ ఈవిధంగా మాట్లాడవు అని ఆయన అన్నారు. కచ్చితంగా జనసేన బీజేపీ కూటమి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి వైఎస్ఆర్సిపి పార్టీ లకు పరాభవం తప్పదు అని ఆయన విశ్లేషించారు.
అయితే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, సోము వీర్రాజు గారు పవన్ కళ్యాణ్ విషయం లో ముఖ్య మంత్రి అన్న పదం వాడలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర అధినేత అన్న పదాన్ని మాత్రమే వాడారు అని ఆయన అన్నారు. బిజెపి జనసేన కూటమి అధికారం లోకి వస్తే ముఖ్య మంత్రి ఎవరు అన్నది జాతీయ స్థాయిలో బీజేపీ నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. అంత లోనే తన వ్యాఖ్యలను కొంత కవర్ చేసుకుంటూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ ని కలుపుకుని పోతూ ఈ వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థి పార్టీలకు ఇంత ఉలుకు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.
విష్ణు వర్ధన రెడ్డి ఎందుకు అలా అని ఉండవచ్చు:
అయితే ఈ రోజు సోము వీర్రాజు తో పాటు అనేక మంది బీజేపీ నేతలు తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని వ్యాఖ్యానిస్తూ ఉంటే విష్ణు వర్ధన్ రెడ్డి మాత్రం అందరికీ భిన్నంగా మాట్లాడడం ఆయన నేపథ్యం తెలిసిన వారికి ఆశ్చర్యం కలిగించలేదు. ఆయన బీజేపీ నేత అయినప్పటికీ, తన సొంత పార్టీ కంటే కూడా తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు నెలకొల్పిన పార్టీలపై ఆయన ఎక్కువ అభిమానాన్ని చూపిస్తూ గతంలో ఆయన ట్వీట్ చేసి ఉన్నారు. అదేవిధంగా తన ఫేవరెట్ హీరోయిన్ సమీరా రెడ్డి అంటూ ఆవిడ గురించి ఆయన చేసిన వర్ఢన లు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం కలిగించాయి. ఆయన ఫేవరెట్ హీరోయిన్ హీరో డైరెక్టర్ అందరూ ఆయన సామాజిక వర్గానికి మాత్రమే చెందిన వారు ఉండడం చూసి, రాజకీయాల్లో ఇంత పై స్థానంలో ఉన్నవారు కూడా ఇలా ఆలోచిస్తారా అని ప్రజలకు అనిపించింది.
మొత్తం మీద ఆయనకు తన పార్టీ కంటే కూడా తన సొంత సామాజిక వర్గం , తన సొంత ప్రయోజనాలు ముఖ్యం అన్న అభిప్రాయాన్ని గతంలో ఆయన చేసిన ట్వీట్స్ ప్రజలకు కలిగించాయి. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరికి విరుద్ధంగా ఆయన టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలు అదే రకమైన కోవలోకి వస్తాయి ఏమో అని ప్రజలకు అనిపించే ఆస్కారముంది. ఇప్పుడిప్పుడే జన సైనికులు బిజెపి వైపు మొగ్గు చూపుతున్న సమయంలో విష్ణు వర్ధన్ రెడ్డి లాంటి వారి వ్యాఖ్యలు బిజెపి అభ్యర్థి అవకాశాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని వారు విశ్లేషిస్తున్నారు. నిజంగా ఆయనకు ఇదే ఉద్దేశం ఉంటే గనక ఆయనకు తమ పార్టీ గెలుపు కంటే కూడా ఇతరత్రా అంశాలే ముఖ్యం అని ప్రజల్లో ఇప్పటికే ఉన్న భావన మరింత బలపడే అవకాశం ఉంది.