వైఎస్ జగన్‌కు సిగ్గు,శరం ఉంటే రాజీనామా చేయాలని బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి సవాల్ చేస్తున్నారు. సీఎం జగన్ తీరును కేంద్రం గమనిస్తోందని.. సరైన సమయంలో సరైన యాక్షన్ తీసుకుంటుందని ఆయన అంటున్నారు. కోర్టులను తప్పుబడితే సర్వనాశనం అవుతారు..జగన్‌కూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. కోర్టులు ముక్కు పగిలేలా.. పళ్లు రాలేలా కొట్టినా సీఎంకు సిగ్గు లేదని… మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం.. వైసీపీ నేతలు దోచుకుంటున్నారు.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరిస్తూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వివేకా హత్య కేసు, డాక్టర్ సుధాకర్ కేసులను సీబీఐకి అప్పగించడం చూస్తుంటే.. ఏపీలో జగన్ పాలన ఉందో అర్థమవుతుందని తేల్చేశారు.
భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఆదినారాయణ రెడ్డి సైలెంటయిపోయారు. ఎన్నికలకు ముందు రామసుబ్బారెడ్డితో రాజీ కారణంగా.. తనకు వచ్చిన ఎమ్మెల్సీ సీటును.. తన సోదరుడి కుమారుడికి ఇచ్చారు. ఆయన వైసీపీకి మద్దతుగా మారిపోయారు. అయినప్పటికీ..ఆదినారాయణరెడ్డి.. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జగన్మోహన్ రెడ్డిపై ఫైరవుతున్నారు. గతంలో ఆయన వైసీపీ తరపునే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. టీడీపీలోకి ఫిరాయించి మంత్రిగా పదవి పొందారు. దాంతో జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ అయ్యారు.
ప్రభుత్వం మారిన తర్వాత వివిధ రకాల ఒత్తిళ్లు రావడం..క్యాడర్ ను కాపాడుకోవడానికి తప్పనిసరి కావడంతో… బీజేపీలో చేరిపోయారు. అయినా.. ఆయన జగన్ పై వ్యతిరేకతతో ఉన్నారు. కోర్టులు తప్పు పట్టేలా రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని… బీజేపీ నేతలు ఎవరూ పెద్దగా విమర్శలు చేయడం లేదు..కానీ ఆదినారాయణరెడ్డి మాత్రం.. నేరుగా రాజీనామా డిమాండ్ నే వినిపిస్తున్నారు.