తెలంగాణలో నాలుగు ఎంపీలొచ్చాయి. రాష్ట్రంలో కాలు మోపనీకి ఈమాత్రం చోటు చాలు. ఇంకేముంది, కూర్చునే జాగా వెతుక్కోవాలి! ఇప్పుడు అదే పనిలోపడింది భాజపా. గతవారమంతా పార్క్ హయ్యత్ లో రామ్ మాధవ్ కూర్చుని, కొందర్ని కలిశారట! వాళ్లంతా కాంగ్రెస్సోళ్లే, ఆళ్లే వీక్ గా ఉన్నారు, పోతారు… మాకేం ఫరక్ పడదని తెరాస అనుకుంది. అబ్బే… వీళ్లనీ ఎందుకు వదుల్తం, వచ్చేటోళ్లుంటే సక్కగా చేర్చుకుంటం అన్నట్టుగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నారు. ఎవ్వరచ్చినా సరే… భాజపా తలుపులు, బరాబర్ తెరిసున్నయ్ అంటున్నారు! ఇతర పార్టీల నుంచి చాలామంది టచ్ లో ఉన్నారంటూనే, ఆ పార్టీల్లో తెరాస పేరు కూడా కలిపి చెప్పారు లక్ష్మణ్..!
పలువురు తెరాస నాయకులు తమతో టచ్ లో ఉన్నారని, మిగతా నాయకులతో కలిసి వాళ్లు కూడా కాషాయ కండువాలు కప్పుకుంటారన్నారు. చేరికలకు ముందు వచ్చే నాయకులతో రాజీనామాలు చేయించాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయమే అన్నారు. ఈ మాట ఎందుకంటే… రాజీనామాలు చెయ్యక్కర్లేదని రాబోతున్నవారికి సంకేతాలు ఇచ్చారన్నట్టు. సీఎం కేసీఆర్ కి ముఖం చెల్లలేదు కాబట్టే, నీతీ ఆయోగ్ కి వెళ్లలేదన్నారు. మరోసారి మోడీ ప్రధాని కాలేరని తండ్రీ కొడుకులు (కేసీఆర్, కేటీఆర్) ఎన్నికల్లో ప్రచారం చేశారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మోడీ సర్కారు చాలా చేసిందనీ, ప్రధానిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలన్నారు. తెలంగాణపై తమ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టందని, త్వరలోనే అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారని లక్ష్మణ్ చెప్పారు.
తెరాస నేతలూ చేరబోతున్నారంటూ ఓరకంగా మైండ్ గేమ్ ప్రారంభించారు లక్ష్మణ్! సాల్ తీయ్.. మా పార్టీవాళ్లా భాజపాలో చేరుడేంది… నో వే అని తెరాస ఇప్పుడు ఖండిస్తుందా..? పోనీ.. రాజీనామాలు చేయకుండా అలా చేర్చేసుకుంటే ఎలాగండీ, ఓ పద్ధతీ పాడూ గట్రా ఉండక్కర్లా అనీ నిలిదీస్తుందా..? ఎందుకంటే, మొన్నమొన్ననే కదా సీఎల్పీని విలీనం చేసుకున్నారు. పోనీ.. ఆయనేదో ముచ్చట చెప్పిండులే అని లక్ష్మణ్ ప్రకటనని లైట్ తీసుకోగలరా..? ఈ ప్రకటన ప్రభావం తెరాసలో ఎంతో కొంత ఉంటది. ఎందుకంటే, గతంలో మాదిరిగా ఇప్పుడు కేసీఆర్ విషయంలో కేంద్రం అలయ్ బయల్ అంటుందో అనదో… అందరికీ డౌటే! ఫెడరల్ ఫ్రెంటూ, ఢిల్లీకి వోయి సెక్రం తిప్పుతా, మోడీ గెల్వడూ గిల్వడూ అదీఇదీ అంటూ ఎన్నికల ప్రచారంలో బల్లగుద్దేశారు. ఆ మాటలు భాజపా బాగా మనసులో పెట్టేసుకుందిప్పుడు. నీతీ ఆయోగ్ కి కూడా కేసీఆర్ పోకబాయే. సహాయ మంత్రై అచ్చినక కిషన్ రెడ్డన్న కూడా గట్టగిగానే విమర్శలు చేస్తుండు. ఇంకేముంది… సున్నం పెట్టుకున్నట్టే కదా! గా పెద్దాయన్తో పెట్టుకుంటే ఏమైతదో పక్క రాష్ట్రంలో చూడలే! కాబట్టి, తెరాస వాళ్లను లాగే ప్రయత్నం భాజపా మొదలుపెట్టే అవకాశం లేదని చెప్పలేం. ఏమైనా జరగొచ్చు!