తెలంగాణ భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ నేత మహేశ్వర్ రెడ్డి.. విధానపరమైన అంశాలపై మాట్లాడటం లేదు. వాటి గురించి మాట్లాడటానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు ఉన్నారు.. తాను మాట్లాడినా ఎవరూ పట్టించుకోవడం లేదని అనుకున్నారేమో కానీ..రేవంత్ రెడ్డి గురించి పుకార్లను పుట్టించి, వాటిని ప్రచారం చేయడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజూ మీడియాకు అవే కబుర్లు చెబుతున్నారు. అంతకు మించిన వార్తలు లేవన్నట్లుగా కొన్ని చానళ్లు వాటినే ప్రసారం చేసుకుంటున్నాయి.
గత వారం ఆయన.. రేవంత్ రెడ్డిని డిసెంబర్ కల్లా సీఎం పోస్టు నుంచి తప్పిస్తారని ఆ మిషన్ మీదనే.. మీనాక్షి నటరాజన్ ను పంపారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలపై ఆయనకు అంత డీప్ సమాచారం ఉందా అని మిగతా వారు ఆశ్చర్యపోయారు. కానీ కొన్ని చానళ్లకు మాత్రం అదేదో కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పినట్లుగా ప్రచారం చేశాయి. తాజాగా ఆయన కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు వాగ్వాదానికి దిగారని ఆరోపించారు. సీఎంపై మంత్రులు పైరయ్యారని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన మాటలు మళ్లీ కొన్ని టీవీ చానళ్లలో హైలెట్ అయ్యాయి.
నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే.. మహేశ్వర్ రెడ్డి చెప్పడానికన్నా ముందే బయటకు తెలిసిపోయేది. ఎందుకంటే అలా వాగ్వాదానికి దిగిన వారో..లేకపోతే రేవంత్ పై అంత వ్యతిరేకంగా ఉన్న వారు ఎవరో ఒకరు బయట పెట్టేవారు. మీడియాలో హైలెట్ అయ్యేది. మహేశ్వర్ రెడ్డి చెప్పేదాకా దాచి పెట్టుకోరు. కానీ మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేయాలనో.. మరో కారణమో కానీ.. పుకార్లు పుట్టించాలని అనుకుంటున్నారు. ఆయన పుకార్లను రేవంత్ పట్టించుకుంటారో లేదో కానీ.. మహేశ్వర్ రెడ్డి వైపు మాత్రం అందరూ విచిత్రంగా చూస్తున్నారు.