రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండేళ్ళవుతున్నా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. దానిపై భాజపా జాతీయ మహిళా మోర్చా ఇన్-చార్జ్ మాజీ విశాఖ ఎంపి డి పురందేశ్వరి వివరణ ఇది:
రైల్వే బడ్జెట్ లో దీని ప్రసక్తి చేయలేదని రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనే సంగతి మాకు తెలుసు. కానీ దీనికి రైల్వే బడ్జెట్ కి ఎటువంటి సంబంధం లేదు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకి నేను గతంలో రైల్వే మంత్రులుగా పనిచేసినవారందరినీ కలిసి మాట్లాడేను కానీ ఫలితం రాలేదు. మళ్ళీ ఇప్పుడు రైల్వే మంత్రిగా ఉన్న సురేష్ ప్రభుని కలిసి గట్టిగా అడిగాము. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీని కోసం రైల్వే బోర్డులో ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఈసారి దానికి ఎన్ని అవాంతరాలు ఎదురయినా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం తధ్యమని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నిర్దిష్ట తేదీ చెప్పలేను కానీ త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయడం ఖాయం దీనిపై రాష్ట్ర ప్రజలు నిరాశ చెందనవసరం లేదు,” అని పురందేశ్వరి చెప్పారు.