కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని… ఇప్పుడా కాంగ్రెస్ పార్టీతోనే..టీడీపీ కలసి వెళ్లేందుకు ప్రయత్నిస్తోందని.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్.. గుంటూరులో విమర్శించారు. అసలు రామ్‌మాధవ్ గుంటూరు పర్యటనకు వచ్చింది.. తాను ఏరి కోరి… ఏపీ బీజేపీ అధ్యక్షునిగా నియమించిన కన్నా లక్ష్మినారాయణ పదవి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో పాల్గొనడానికి. ఎవరు ఈ కన్నా లక్ష్మినారాయణ..? యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి…కాంగ్రెస్ సిద్ధాంతాలు నరనరాన జీర్ణించుకున్న వ్యక్తి కన్నా లక్ష్మినారాయణ. ఆయన రక్తంలో కాంగ్రెస్ అనుకూలత ఎలా ఉంటుందో.. .. సంఘ్‌పై వ్యతిరేకత కూడా ఆయనకు అదే స్థాయిలో ఉంటుంది. రాష్ట్ర విభజన కారణంగా రాజకీయ భవిష్యత్ కోసం ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలోనూ అది దొరకదని డిసైడయిన తర్వాత వైసీపీలోకి వెళ్లాలని ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ అగ్రనేతలే.. ఈ కాంగ్రెస్ వాదిని బుజ్జగించి.. ఏపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.
అయినా అదేమీ తప్పు కాదన్నట్లు చెప్పుకొస్తున్న రామ్‌మాధవ్… కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి కూటమి కట్టడం లేదని చెబుతున్న తెలుగుదేశం పార్టీపై మాత్రం విమర్శలు ప్రారంభించారు. ఆనాడు తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతీశారు కాబట్టి..ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. అప్పుడు ఆ పని చేసింది కాంగ్రెస్. కానీ ఇప్పుడు అంత కంటే ఎక్కువగా తెలుగువారిని నమ్మించి మోసం చేస్తోంది బీజేపీనే. అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీ. అప్పటికి.. ఇప్పటికి..తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పార్టీలన్నింటికీ టీడీపీ వ్యతిరేకమేనంటున్నారు టీడీపీ నేతలు. ఇలా చేసిన వాళ్లకు బుద్ది చెప్పకుండా తెలుగుదేశం పార్టీ వదలి పెట్టదు అనే హెచ్చరిస్తున్నారు. అక్కడ టాపిక్ కాంగ్రెస్ కాదు.. తెలుగువాడి ఆత్మగౌరవం అనేది టీడీపీ నేత వాదన. అయినా కాంగ్రెస్‌తో జతకడతామని కానీ… కూటమి పెడతామని కానీ టీడీపీ ఎప్పుడూ చెప్పలేదు. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో ఎదురైతే..రాహుల్‌ను చంద్రబాబు భుజం తట్టారు అంతే. ఎన్ని సార్లు ప్రధానమంత్రి మోదీ .. రాహుల్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు..? అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.
ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన రామ్‌మాధవ్ .. ఇంతో ఇంతో విలువలున్న రాజకీయాలు చేస్తారని చాలా మంది అంచనా వేశారు. కానీ అమిత్ షా కన్నా.. దిగజారిపోయిన రాజకీయాలు రామ్ మాధవ్ చేస్తున్నారు. సంఘ్‌ను జీవితకాలం వ్యతిరేకించిన వ్యక్తికి.. బీజేపీ రాష్ట్ర శాఖ బాధ్యత అప్పగిస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనడాన్ని సమర్థిస్తున్నారు. ప్రభుత్వాలను తారుమారు చేయడానికి సహకరిస్తున్నారు. అంతకు మించి.. దక్షిణాదిపై దండయాత్రలు చేస్తామంటూ.. చంద్రబాబు సంగతి తేలుస్తామంటూ ట్వీట్లు చేస్తున్నారు. రామ్మాధ్ రాజకీయాలు చూస్తున్న వారిని.. ఆరెస్సెస్ విలువల పట్ల కూడా ..నమ్మకం సన్నిగిల్లిపోతోంది.