గడచిన రెండ్రోజులుగా హైదరాబాద్ లోని పార్క్ హయ్యత్ హోటల్ వార్తల్లోకి వస్తోంది! ఎందుకంటే, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అక్కడే బస చేశారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్, తెరాస నాయకులతో ఆయన భేటీ అవుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. అంటే, ఆపరేషన్ తెలంగాణ ఆయన మొదలుపెట్టేసినట్టే. ఈశాన్య రాష్ట్రాల్లో ఉనికి లేని భాజపాని, అధికారంలోకి తీసుకుని రావడంలో రామ్ మాధవ్ వ్యూహం ఎంత పక్కాగా వర్కౌట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు దక్షిణాదిన కర్ణాటక తరువాత నాలుగు ఎంపీలతో తెలంగాణలో కొంత బేస్ దొరికింది కాబట్టి, ఆయన ఆపరేషన్ మొదలైందని అనిపిస్తోంది. అయితే, పశ్చిమ బెంగాల్ లో ఏ తరహా వ్యూహం అనుసరిస్తున్నారో… అదే మోడల్ ను తెలంగాణలో కూడా అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే… తెలంగాణలో కూడా బెంగాల్ తరహా వాతావరణమే ఉందనేది భాజపా అంచనా. రాష్ట్రంలో వామపక్షాలను నిర్వీర్యం చేసేస్తే, తనకు తిరుగుండదని మమతా బెనర్జీ అనుకున్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ను మరింత బలహీనపరిస్తే, ఎదురుండదని కేసీఆర్ కూడా భావించారు. అందుకే, ఏకంగా సీఎల్పీని విలీనం చేసేశారు. బెంగాల్ లో భాజాపా చొరబడేందుకు ఎలాంటి అనువైన పరిస్థితిని మమతా సృష్టించారో, తెలంగాణలో కూడా అదే తరహాలో కేసీఆర్ ఆ పార్టీకి చోటిచ్చారని అనొచ్చు! ఇంకోటి ముస్లిం ఓటు బ్యాంకు విషయంలో కూడా బెంగాల్ లో మమతా ఏం ఏశారూ… మైనారిటీ ఓటు బ్యాంకును గట్టిగా పట్టుకుంటే చాలనుకున్నారు. ఇక్కడా కేసీఆర్ అదే పని చేస్తూ… ఎమ్.ఐ.ఎమ్.ను మిత్రపక్షంగా చేసుకున్నారు. ప్రతిపక్షాలు లేని పరిస్థితిని క్రియేట్ చేసుకుంటే, మరో పార్టీకి అవకాశం ఉండదని భావించారు. కానీ, భాజపా ప్రస్తుతం అధికారంలో ఉన్న జాతీయ పార్టీ. పైగా, తెరాసతో ఎలాంటి రాజకీయ అవసరాలు లేని స్థితిలో ఉంది! తెలంగాణలో వ్యూహం అమలుకు ఇంకెందుకు ఆలస్యం?
బెంగాల్ మారిదిగా భాజపాకి ఇక్కడ అడ్వాంటేజ్ కనిపిస్తోంది. హిందూ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని అక్కడ లోక్ సభ ఎన్నికల్లో భాజపా లాభపడింది. తెలంగాణలో కూడా ఇదే డివిజన్ తీసుకొస్తూ, హిందూ ఓటు బ్యాంకు ఆకర్షణ లక్ష్యంగా భాజపా పావులు కదిపేందుకు సిద్ధపడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే, ముందుగా కొంతమంది నాయకుల్ని ఆకర్షించి, తరువాత బెంగాల్ తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహంతో పార్టీని బలోపేతం చేయడమే రామ్ మాధవ్ ముందున్న రాజకీయ లక్ష్యంగా కనిపిస్తోంది. మొత్తానికి, ఆపరేషన్ తెలంగాణ నెమ్మదిగా మొదలైన వాతావరణమే నెలకొంది.