ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇవ్వబోతున్న పది శాతం రిజర్వేషన్లతో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో లాభపడుతుందా..? నష్టపోతుందా..? ఇది.. కొత్తగా రాజకీయాల్లో ప్రారంభమైన చర్చ. ఎందుకంటే.. ఇది గత మూడు రోజుల నుంచి… అగ్రవర్ణ పేదల కోసం అంటూ చర్చ జరిగింది. కానీ.. వాస్తవానికి పేదలకు కాదని.. భారతీయ జనతా పార్టీనే… రాజ్యసభలో అంగీకరించాల్సి వచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే… పది శాతం రిజర్వేషన్లు అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అంటే.. అగ్రవర్ణాలకు మాత్రమే కాదు.. అందరూ ఈ కేటగిరిలోకే వస్తారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని రాజ్యసభలో స్పష్టంగా ప్రకటించారు. బిల్లు విషయంలో.. అడ్డు చెప్పనప్పటికీ.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విపక్షాలు పక్కా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
ఆర్థికంగా వెనుకబడిన వారికి కోటా పేరుతో.. కులం ప్రకారం ఉన్న రిజర్వేషన్లను మంగళం పాడాలనే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు… రిజర్వేషన్లు పొందుతున్న వర్గాల్లో ప్రారంభమయ్యాయి. ఈ అవకాశాన్ని రాజకీయ పార్టీలు వదిలి పెట్టే అవకాశం లేదు. రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నం బీజేపీ చేస్తోందని.. అంతర్గతంగా దీనిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోందని.. గతంలో కొంత మంది బీజేపీకే చెందిన రిజర్వుడు కేటగిరీ ఎంపీలు ఆరోపించారు. ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన యూపీ ఎంపీ సావిత్రిబాయి పూలే ఇవే ఆరోపణలు చేసి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. దానికి ఇప్పుడు.. కొనసాగింపుగా.. ఈ చట్టం కనిపిస్తోంది.ఇప్పటికే రిజర్వేషన్లు పొందుతున్న వర్గాల్లో.. కులం ప్రకారం రిజర్వేషన్లు తొలగిస్తున్నారనే ప్రచారం జరిగితే… భారతీయ జనతా పార్టీకి అది భస్మాసుర హస్తమే అవుతుంది.
ఈ విషయంలో తమపై అనుమానాలు రాకుండా బీజేపీ ఎంత మేర కవర్ చేసుకోగలుగుతుందన్నది కీలకంగా మారింది. ఇప్పటికే.. రాజ్యసభలో ఈ అంశంపై.. ప్రజల్లో అనుమానాలు కలిగేలా అన్ని పార్టీల నేతలూ మాట్లాడారు. ఈ పదిశాతం రిజర్వేషన్ల పరిమితి వల్ల.. అగ్రవర్ణాలకు కలిగే లాభం ఉండదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలాగే.. అసలు కులం ప్రకారం రిజర్వేషన్లు తొలగించే కుట్ర జరుగుతోందన్న అభిప్రాయాన్ని మెల్లగా ఆయా వర్గాల మనసుల్లో చొప్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. పది శాతం రిజర్వేషన్ల వెనుక కుట్ర ఉందన్న.. కేజ్రీవాల్ ట్వీట్ ఈ కోవలోనిదే. మొత్తానికి ముదు ముందు ఈ రిజర్వేషన్లు బీజేపీకి భస్మాసుర హస్తంలానే కనిపిస్తున్నాయి.