ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పొత్తులపై తమ పార్టీ విధానాన్ని సొంతంగా డిసైడ్ చేశారు. పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని హైకమాండ్ చూసుకుంటుందని చెబుతున్నా.. ఆయనలో ఆవేశం మాత్రం తగ్గడం లేదు. తమకు జనంతోనే పొత్తు ఉంటుందని చెబుతున్నారు. జనసేనతో ఉంటుందాలేదా అన్నదానిపై డబుల్ మీనింగ్ డైలాగులు కొడుతున్నారు. అయితే ఆయన పార్టీలోనిఇతర నేతలు మాత్రం భిన్నంగా ఉన్నారు. రాయలసీమలో ప్రాంతీయ బీజేపీ సదస్సును నిర్వహించిన సందర్భంగా హాజరైన నేతల్లో పలువురు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని సూచించారు.
టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి నేరుగా బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవాల్సిందేనన్నట్లుగా మాట్లాడారు. టీడీపీ విషయంలో ఇంకా అభిమానంతో ఉన్నారని ఆ కారణం చూపించి పార్టీలో ఆయనకు ఎలాంటి పదవులు లేకుండా చేశారు. స్టేచర్ ఉన్న లీడర్ అయినా ఆయనను పక్కన పెట్టినా… పెద్దగా పట్టించుకోకుండా బీజేపీలో కొనసాగుతున్నారు. గతంలో తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన సోదరుడి కుమారుడ్ని టీడీపీలో చేర్పించారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. కారణం ఏమైనా ఆదినారాయణరెడ్డి బీజేపీతో టీడీపీ పొత్తుపెట్టుకోవాలంటున్నారు.
నిజానికి బీజేపీలో చేరిన టీడీపీ నేతలందరి ఆలోచన అదే. ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమ కోరిక వెలిబుచ్చుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఏపీ బీజేపీ ప్రో వైసీపీ నేతల చేతుల్లో ఉంది. అందుకే వారి వాయిస్ బయటకు రావడం లేదు. జనసేనను ఎలాగైనా ఒంటరిగా లేదా బీజేపీతో పొత్తుతో కలిసి పోటీ చేసేలా చూడాలన్న లక్ష్యంతో ఉన్న కొంత మంది బీజేపీ నేతలు మాత్రం… వీరిప్రతిపాదనల్ని తిరస్కరిస్తున్నారు. మొత్తంగా బీజేపీలో ముందు ముందు పొత్తుల పంచాయతీ చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.