ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏం చెప్పాలనుకున్నారో.. ఏం చెప్పారో కానీ ఆయన బీజేపీ ప్రజాగ్రహ సభను కామెడీ చేసేశారు. ఆయన ప్రసంగం అందులోని హావభావాలు.. ఆయన ప్రసంగించిన అంశాలు మొత్తంగా బీజేపీ ఇమేజ్ను దిగజార్చాయి. ఇతర నేతలంతా చాలా సీరియస్‌గా వైఎస్ఆర్ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్‌లాగా ప్రసంగిస్తే.. సోము వీర్రాజు మాత్రం సీరియస్ కామెడీ చేశారు. దీంతో మొత్తం సభ సీరియస్ నెస్‌పై ప్రజల్లోకి తేడాగా సందేశం వెళ్లింది.
తమను గెలిపిస్తే రూ. యాభైకే చీప్ లిక్కర్ ఇస్తామని సోము వీర్రాజు హామీ ఇవ్వడంపై బీజేపీ నేతలే మండిపడుతున్నారు. ఇంత దిగజారిపోతారా.. అదీ ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి ఇంత దారుణమైన ఆలోచనలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. పలువురు బీజేపీ కార్యకర్తలు కూడా ఇదే తరహా అభిప్రాయాలతో పోస్టులు పెట్టారు. ఇక ఆయన చేసిన ప్రసంగంలోనూ ఇతర అంశాలూ అదే స్థాయిలో ఉన్నాయి. ఆయన హావభావాలు చూస్తే.. ఎందుకంత ఆవేశపడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. అధికారం ఇస్తే తను ఏదో అయిపోదామనుకుంటున్నా అని..కానీ చాన్స్ రాదేమోనని కంగారు పడుతున్నట్లుగా ఆయన తీరు ఉందన్న విమర్శలు బీజేపీలోనే వినిపిస్తున్నాయి.
బీజేపీ సభను వ్యూహాత్మకంగానే కామెడీ అయ్యేలా సోము వీర్రాజు చేశారన్న అనుమానాన్ని ఆ పార్టీలోని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా అలా చేయడం వల్ల వైసీపీ నేతలపై ఇతర బీజేపీ నేతలు.. జాతీయ నాయకులు చేసిన విమర్శలు పక్కకుపోతాయని ఇలా చేశారని అంటున్నారు. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాగ్రహ సభ చివరికి సోము వీర్రాజు ఓవరాక్షన్‌తో తేలిపోవడం.. ఆయన వ్యవహారమే హైలెట్ కావడం.. బీజేపీకి ఇబ్బందికరమే.