ఆంధ్రాలో టీడీపీని మరింత బలహీనపరచి ఎదగాలన్న వ్యూహంతో భాజపా ఉందనేది ఎప్పటికప్పుడు స్పష్టమౌతూనే ఉంది. అందుకే, వారి టార్గెట్ టీడీపీ నేతలకు ఆకర్షించడమే! ఇప్పటికే రాజ్యసభ ఎంపీలను చేర్చుకున్నారు. మిగిలిన మరికొంతమంది నేతల్ని కూడా ఆకర్షించేందుకు అన్ని మార్గాలూ భాజపా సిద్ధం చేసుకుని ఉందనడంలో సందేహం లేదు. దాన్లో భాగంగా టీడీపీలో కొనసాగితే భవిష్యత్తు ఉండదనే ఒక అభిప్రాయాన్ని ఉన్న నేతల్లో కలిగించాలన్నదే భాజపా తాజా వ్యూహంగా కనిపిస్తోంది. తాజాగా ఆ పార్టీ నాయకుడు సునీల్ దేవ్ ధర్ మీడియాతో మాట్లాడుతూ… తెలుగుదేశం నేతలు వీలైనంత త్వరగా భాజపాలోకి వచ్చి చేరాలని ఆహ్వానించారు.
టీడీపీతో ఎలాంటి పొత్తులూ ఇప్పుడూ ఎప్పుడూ ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు సునీల్. ఆ పార్టీకి భాజపా తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం కాదనీ, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా… వీరందరితో కూలంకషంగా చర్చలు జరిపాక తీసుకున్న నిర్ణయం ఇదన్నారు. భాజపాలో చేరాలనుకునే టీడీపీ నేతలకు ఇదే సరైన సమయమనీ, ఎవరి సిగ్నల్ కోసమ ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. తొందరగా భాజపాలో జాయిన్ అయ్యేవారు ఎక్కువ రాజకీయ ప్రయోజనాలు పొందుతారనీ, ఆలస్యంగా చేరేవాళ్లు కొంత వెనకబడతారన్నారు. చేరాలనుకునేవారు నేరుగా భాజపా ఆఫీస్ కి ఫోన్ చేస్తే చాలన్నారు. ఆంధ్రాలో టీడీపీ ఉండదని జోస్యం చెప్పారు.
విచిత్రం ఏంటంటే… టీడీపీకి భాజపా తలుపులు శాశ్వతంగా మూసుకున్నాయ్, కానీ టీడీపీ నేతలకు మాత్రం బార్లా తెరిచి పెట్టినట్టు సునీ చెప్పడం. తొందరగా వస్తే ఎక్కువ లాభమంటూ బహిరంగంగా నాయకులకు ఎర వేసే ప్రయత్నమే ఇది! ఎన్నికల్లో ఓడిపోయినా, మళ్లా పార్టీ బలపడుతుందీ, వచ్చే ఎన్నికల నాటికి సత్తా పెంచుకుంటుందనే నమ్మకంతో ఉన్నవారి మనోభావాలను దెబ్బతీసే వ్యూహమే ఇది. తాము చేస్తున్న అభివృద్ధి చూసి రండి, ప్రజలకు మరింత సేవ చేద్దాం కలిసి రండి అంటూ ఎవరైనా పార్టీలోకి ఆహ్వానిస్తే ఒక పద్ధతిగా ఉంటుంది. అంతేగానీ… ఒక పార్టీ ఉనికి కోల్పోతుంది కాబట్టి, తమ పార్టీలోకి వీలైనంత త్వరగా వస్తే రాజకీయ లాభాలుంటాయంటూ ఆహ్వానించడం… డైరెక్ట్ గా బేరాలాడి లాక్కుంటున్నట్టుగానే ఉంది. ఈ ఆహ్వానంలోనే ఒక రకమైన బెదింపు ధోరణి కూడా కనిపిస్తోంది. మరి, ఈ వ్యూహాంతో టీడీపీ నుంచి ఎంతమంది నేతల్ని భాజపా బయటకి తీసుకుని రాగలదో చూడాలి!