ఏపికి కేంద్రప్రభుత్వం మొన్న రూ.1,976 కోట్లు నిధులు విడుదల చేసినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు కేంద్రప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. రెండు రోజులు మౌనంగా ఊరుకొన్న రాష్ట్ర భాజపా నేతలు కూడా మళ్ళీ యధాప్రకారం వారిపై ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. రాష్ట్ర భాజపా నేత సురేష్ రెడ్డి నేరుగా చంద్రబాబు నాయుడుపైనే విమర్శలు గుప్పించడం విశేషం.
“ముఖ్యమంత్రి డిల్లీలో మా నేతలని పొగుడుతూ ఉంటారు. వారితో సఖ్యతగా ఉంటారు. వారు రాష్ట్రానికి వస్తే చాలా మర్యాదలు చేస్తారు. గౌరవంగా మెలుగుతారు. కానీ అవకాశం చిక్కినపుడల్లా కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటారు.
కేంద్రం రాష్ట్రానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదని దుష్ప్రచారం చేస్తుంటారు. అమరావతి రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.20, 000 కోట్లు, వివిధ పద్దుల క్రింద మొత్తం రూ.1.45 లక్షల కోట్లు ఇచ్చామని విజయవాడ సభలో కేంద్రమంత్రి నితిన్ గడ్కారి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చప్పట్లు కొట్టారు కదా? మరి ఇప్పుడు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదు..సహాయసహకారాలు అందించడం లేదు..అని ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? డిల్లీలో మా ప్రభుత్వాన్ని, మంత్రుల్ని పొగుడుతూ రాష్ట్రంలో మాపై ఎందుకు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు?” అని ప్రశ్నించారు.
“తెదేపా తీరు చూస్తే అది కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి మా పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోందా? అనే అనుమానం కలుగుతోంది. 2019ఎన్నికలలో మళ్ళీ కేంద్రంలో మా ప్రభుత్వం రాకుండా అడ్డుకోనేందుకు కుట్రలు పన్నుతున్నట్లు అనుమానం కలుగుతోంది,” అని అన్నారు.
“పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు విడుదల చేయడం లేదని మమ్మల్ని విమర్శిస్తున్న చంద్రబాబు నాయుడు దాని కోసం ఇంతవరకు ఇచ్చిన నిదులకి లెక్కలు ఎందుకు చెప్పడం లేదు. ట్రాన్స్ టాయ్ కంపెనీ పనులు చేయకపోయినా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తూ మళ్ళీ ఆర్ధిక సమస్యలున్నాయని, కేంద్రప్రభుత్వం సహాయం చేయడం లేదని చెప్పుకోవడం ఎందుకు?” అని సురేష్ రెడ్డి ప్రశ్నించారు.
సురేష్ రెడ్డి నేరుగానే ప్రశ్నించారు కనుక వాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదా ఆయన మంత్రులు నేరుగానే సమాధానం చెపితే బాగుటుంది.