2014 ఎన్నికల ప్రచారం సమయానికి, ఇప్పటికి పవన్‌లో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? సమాజం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్‌లాంటి వారు చాలా మంది కావాలని స్వయానా నరేంద్రమోడీనే పవన్‌కి సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇక వెంకయ్యనాయుడులాంటి వాళ్ళు చేసిన పవన్ భజన గురించి కొత్తగా చెప్పేదేముంది? కానీ అదే పవన్ కళ్యాణ్ మానసిక సమతుల్యత లేకుండా మాట్లాడుతున్నాడని ఇప్పుడు బిజెపి నేతలకు అనిపిస్తోంది. ఇంచుమించుగా పవన్ కళ్యాణ్‌కి మెంటల్ అన్న అర్థం వచ్చేలా బిజెపి నేతలు మాట్లాడుతున్నారు. ఒకవైపు బిజెపి మిత్రపక్ష నేత చంద్రబాబునాయుడేమో విమర్శించొచ్చు కానీ మాటలు హద్ధు మీరకూడదు అని చెప్తూ ఉంటారు. మరోవైపు నాయకులేమో ఇలా రెచ్చిపోతూ ఉంటారు. పవన్ మానసిక సమతుల్యత సరిగా లేదేమో అని అనుమానించేంత మార్పు పవన్‌లో ఏమి వచ్చింది?
2014 నరేంద్రమోడీ భజన చేశాడు. వెంకయ్యనాయుడితో సమానంగా పవన్ కూడా మోడీని దేవుడిని చేసేయడంలో పోటీపడ్డాడు. మోడీ హామీలకు నాదీ పూచీ అనే స్థాయిలో ప్రచారం చేసిపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్ళ వరకూ తన సినిమాలు ఏవో తాను చూసుకుంటూ రాజకీయాల విషయం మర్చిపోయాడు. మోడీ పనిచేయకపోయినా ప్రశ్నిస్తా అన్న పవన్ మౌనంగా ఉండిపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చేశాయి. ప్రత్యేకహోదా సహా అన్ని విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ని దగా చేసిన నరేంద్రమోడీ విషయంలో పవన్ స్పందన ఏంటని నలువైపుల నుంచీ విమర్శలు రావడంతో పవన్‌కి తప్పలేదు. అప్పటి నుంచీ అప్పుడప్పుడూ షో చేస్తున్నాడు. హోదా, రైల్వేజోన్‌లాంటి ప్రజలకు అవసరమైన ఎన్నో విషయాలుండగా అసలు ఎవరికీ సంబంధంలేని…ఎవరూ పట్టించుకోని ఉత్తరాది-దక్షిణాది కాన్సెప్ట్ ఎంచుకున్నాడు పవన్. రాష్ట్రం ఎదుర్కుంటున్న సమస్యలపైన పోరాడితే చంద్రబాబుకు ఇబ్బంది అవుతున్న ఉద్ధేశ్యంతోనే పవన్ ఈ ఉత్తర-దక్షిణ పాట పాడుతున్నాడని విపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. కానీ బిజెపికి ఆ మాట చెప్పే అవకాశం లేదుగా. అందుకే మోడీ భజన మానేసినా పవన్‌ని మానసిక స్థితి సరిగాలేనివాడిగా చిత్రించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్టున్నారు.
బిజెపి నేతలు ఇప్పుడు చిరంజీవి పార్టీ గురించి కూడా పవన్‌పై కౌంటర్స్ వేస్తున్నారు. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి మాంచి బేరానికి అమ్మేసుకున్నాడని……పవన్ పార్టీ పరిస్థితి ఏంటని…..పవన్‌ది కూడా బేరసారాల వ్యవహారమే అన్న అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. బాగుంది…చాలా బాగుంది……కాకపోతే ఈ ప్రశ్న ఏదో 2014 ఎన్నికల ప్రచారం సమయంలోనే పవన్‌ని అడిగి ఉండాల్సింది. భజన చేస్తూ ఉంటే చాలు వీరప్పన్‌లాంటి వాళ్ళను కూడా భుజాన మోసే టైప్ మన నాయకులు. అదే విమర్శలకు దిగితే మాత్రం మహాత్మా గాంధీని కూడా వీరప్పన్‌గా చూపించి జైల్లో పెట్టెయ్యగలరు. ఇక్కడ మళ్ళీ పవన్ మహాత్ముడా అనే ప్రశ్న వద్దు. మన నాయకుల వ్యవహారశైలి గురించి చెప్పడానికి ఒక ఉదాహరణ అంతే.