తెలంగాణలో కూడా ఎన్డీఏ యాక్టివ్ కాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలం పుంజుకున్నా దక్షిణ తెలంగాణ, గ్రేటర్ పరిధిలో బలహీనంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఏపీలోని ఎన్డీఏలోని కీలక మిత్రపక్షాలు అయిన టీడీపీ, జనసేనను తెలంగాణలో దింపాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అయితే దీనిపై బీజేపీ నేతల నుంచి వ్యతిరేకత వస్తోంది. అలాంటి ప్రయత్నమే వద్దని అంటున్నారు.
తెలంగాణలో కూటమి వద్దన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
తెలంగాణలో కూటమి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంతో…. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తన అభిప్రాయం చెప్పారు. తెలంగాణ లో కూటమి అనేది మంచి ఆలోచన కాదని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చినట్లవుతుందని .. అలాంటి ప్రయత్నాలే వద్దన్నది తన అభిప్రాయమన్నారు. ఆయన బయటకు చెప్పారు కానీ మిగతా ఎమ్మెల్యేలదీ ..కీలక నేతలది అదే అభిప్రాయం.
దక్షిణ తెలంగాణ నేతలేమంటారు ?
ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఉత్తర తెలంగాణ వారే. దక్షిణ తెలంగాణలో బీజేపీ కనీస ప్రభావం చూపించలేకపోయిది. ఎంపీ ఎన్నికలలోనూ అంతే. ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఏ పార్టీ మద్దతు అవసరం లేదని అక్కడి నేతల నిశ్చితాభిప్రాయం. కానీ దక్షిణ తెలంగాణకు వచ్చే సరికి కూటమి ఉండాలని బీజేపీ నేతలు కోరుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ పార్టీ వైపు నుంచి ప్రతిపాదన రాకుండా ఎవరూ మాట్లాడే అవకాశం లేదు. గ్రేటర్ లో మినహా ఇతర జిల్లాలలో బలమైన బీజేపీ నేతలు లేకపోవడం కూడా ఓ కారణం అనుకోవచ్చు.
కూటమిలో టీడీపీ ఉంటే కేసీఆర్కు ఆయుధం !
కూటమిలో టీడీపీ ఉంటే కేసీఆర్ దాన్ని ఓ ఆయుధంగా చేసుకునే అవకాశం ఉంది. మరో రూపంలో చంద్రబాబు తెలంగాణకు వస్తున్నారని ఆయన ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబును బూచిగా చూపించడం ద్వారా ఆయన కొన్ని విజయాలు సాధించారు. అయితే అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. కానీ కేసీఆర్ రాజకీయంగా అవకాశం వస్తే వదిలి పెట్టరు.