జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్లో చేరుతున్నారన్న సంగతి తెలియగానే… ఆయన రియల్ ఎస్టేట్ బ్యాక్ గ్రౌండ్ ఒక్క సారిగా తెరపైకి వచ్చింది. ఆయనకు చెందిన ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ హైదరాబాద్లో ప్రధానంగా వ్యాపారం నిర్వహిస్తుంది. దీంతో ఆయన బీఆర్ఎస్లో చేరిక వెనుక ఏదో ఉందని అనుకున్నారు. ఇప్పుడు ఆ “ఏదో”ని బీజేపీ నేతలు పట్టుకుని మీడియా ముందు పెట్టారు. అదేమిటంటే.. మియాపూర్లో 40 ఎకరాల భూమిని ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ కు కేటాయించారట. దీని వెనుక నాలుగు వేల కోట్లని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు.
బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మియాపూర్ లో సర్వే నంబర్ 78 లో40 ఎరాలు కొన్నారు. అయితే అవి వివాదాస్పద భూములు. ఆ భూముల దగ్గరే వ్యాపార వేత్త సుఖేష్ గుప్తా ఎనిమిది ఎకరాలు కొంటే.. అది ప్రభుత్వ భూములని చెప్పి.. కలెక్టర్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. కానీ తోట చంద్రశేఖర్ భూములపై ఎస్ఎల్పీ దాఖలు చేయలేదు. ఇలా ఎందుకు సుప్రీంకు వెళ్లలేదని రఘునందన్ ప్రశ్నిస్తున్నారు. వ్యాపార వేత్త సుఖేశ్ గుప్తాకు ఓ న్యాయం.. తోట చంద్రశేఖర్ కు ఓ న్యాయమా అని నిలదీశారు. తోట చంద్రశేఖర్ 40 ఎకరాలు అమ్మి 4 వేల కోట్లు సంపాదించారని రఘునందన్ ఆరోపించారు. భూ దందా కోసమే తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకుని ఏపీకి అధ్యక్షుడిని చేశారని విమర్శించారు. మియాపూర్ భూములతో లాభపడిన తోట చంద్రశేఖర్ ఖమ్మం సభకు ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు. ఇదంతా ముందస్తు ఒప్పందంలో భాగమేనని విమర్శించారు.
ఇటీవలే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రేశఖర్ ను కేసీఆర్ నియమించారు. అంతకు ముందు ఆయన ఐఏఎస్ ఆఫీసర్. మహారాష్ట్ర క్యాడర్లో పని చేసేవారు. వీఆర్ఎస్ తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. తన కుమారులతో కలిసి ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ అనే కంపెనీ నడుపుతున్నారు. రఘునందన్ బయట పెట్టిన ఈ భూ వ్యవహారం ముందు రాజకీయంగా కలకలం రేపే అవకాశం ఉంది.