తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోలేదని ప్రచారం ప్రారంభించారు. అలా దర్శించుకోకపోగా…ఆయన చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేసి… నామినేషన్ వేశారని.. ఫోటోలు బయట పెట్టారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రెస్ మీట్ పెట్టి అవే ఆరోపణలు చేశారు. గురుమూర్తి మీద బీజేపీ మొదటి నుంచి ఇవే ఆరోపణలు చేస్తోంది. ఆయన క్రిస్టియన్ అని.. ఎస్సీ రిజర్వేషన్ కేటగిరి నుంచి పోటీ చేయడానికి అనర్హుడని అంటోంది. మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు వర్తించవని.. బీజేపీ నేతలు అంటున్నారు.
నిజంగా గురుమూర్తి మతం మార్చుకుంటే… ఆయనను అనుర్హుడ్ని చేయడానికి బీజేపీకి ఎంతో సేపు పట్టదు. కానీ.. ఆయన మతం మార్చుకున్నారని నిరూపించడానికి బదులు.. ఆయన క్రిస్టియన్ అని ప్రచారం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. గురుమూర్తి క్రిస్టియనేనన్న విషయం … వైసీపీ నేతలందరికీ తెలుసు. తిరుపతిలో ఆయన అభ్యర్థిత్వాన్ని జగన్ ప్రకటించినప్పుడు.. కొంత మంది గుసగుసలాడుకున్నారు. ఎవరితోనూ చర్చించకుండా జగన్ నిర్ణయాన్ని ప్రకటించడంతో ఎవరూ తమ అభిప్రాయాన్ని చెప్పే సాహసం కూడా చేయలేదు. జగన్ నిర్దేశించినట్లుగా గురుమూర్తి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు.
అయితే శ్రీవారిని దర్శించుకోకపోయినంత మాత్రాన.. తిరుపతిలో పోటీ చేయకూడదా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. టెంపుల్ సిటీ అయిన తిరుపతి కేంద్రంగా ఉన్న లోక్సభ నియోజకవర్గం నుంచి ఓ క్రిస్టియన్ ఎంపీగా వెళ్తే అది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ కోణంలోనే ఓట్ల వేట సాగిస్తున్నారు. కొసమెరుపేమిటంటే… బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ పై కూడా… క్రిస్టియన్ అనే ప్రచారం ఉంది. ఆమె భర్త కుటుంబం క్రిస్టియానిటీని ఆచరిస్తారు. ఈ విషయంపై ఫోటోలతో సహా ప్రచారం అవుతోంది. కానీ.. బీజేపీ వాటిని పట్టించుకోవడం లేదు.