ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతోంది అని పురందేశ్వరి మొదలుపెట్టిన పాటకు కావూరి సాంభశివరావు కోరస్ పాడటం మొదలుపెట్టారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియలో 23 లక్షలు పైగా ప్రజలు పార్టీలో సభ్యత్వం తీసుకోవడమే అందుకు ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. కావూరి సాంభశివరావు చాలా విచిత్రమయిన కారణాలు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక ఎన్నటికీ కోలుకోలేదు. అలాగే వైకాపా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజలను ఆకట్టుకోలేక పోతోంది. ఇక అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వం పట్ల ప్రజలలో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. కనుక వారు బీజేపీకి దగ్గరవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందో లేక ఇంకా బలహీన పడుతోందో అందరి కంటే కావూరికే బాగా తెలిసి ఉండాలి. నరేంద్ర మోడీ అమరావతిలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీపై ఎటువంటి ప్రకటన చేయకుండా వెళ్ళిపోయిన తరువాత రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు ఏవిధంగా స్పందించాయో ఆయనకి తెలియదనుకోలేము. విభజన చట్టంలో కొన్ని హామీలను అమలు చేసినప్పటికీ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విజయవాడలో మెట్రో రైల్ నిర్మాణం తదితర అంశాలలో మోడీ ప్రభుత్వం ‘యూ’ టర్న్ తీసుకొన్నందుకు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, వారు క్రమంగా బీజేపీకి దగ్గరవుతున్నారని కావూరి చెప్పుకోవడం విచిత్రంగా ఉంది.