జనవరి మొదటివారంలో గుంటూరులో జరిగే బహిరంగ సభకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తారని అనుకున్నారు. కానీ, ఆయన రాలేదు! కారణం అందరికీ తెలిసిందే. విభజన తరువాత ఆంధ్రాకు ఏం చేశారో చెప్పలేని పరిస్థితిలో భాజపా ఉంది. నాలుగేళ్లపాటు నాన్చి కూడా ఏపీకి ఏ సహాయమూ చేయని ప్రధాని రాష్ట్రానికి వస్తే… నిరసన వ్యక్తమయ్యే వాతావరణం కనిపించింది. దీంతో ఆయన పర్యటన విరమించుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతూ ఉండటంతో… ఏపీలో కూడా ప్రచారానికి భాజపా సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు ప్రారంభించాలని భాజపా ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 4 నుంచి పదిహేను రోజులపాటు బస్సు యాత్ర చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. వచ్చే నెల 4న పలాసాలో ఈ యాత్ర ప్రారంభమౌతుంది. కర్నూలు జిల్లా ఆదోని వరకూ ఈ యాత్ర సాగుతుంది.
ఈ యాత్ర ద్వారా దాదాపు 85 నియోజక వర్గాల్లో పర్యటించేందుకు భాజపా నేతలు సిద్ధమౌతున్నారు. యాత్ర ప్రారంభించేందుకు శ్రీకాకుళం జిల్లా పలాసకి భాజపా అధ్యక్షుడు అమిత్ షా వస్తున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. అక్కడి నుంచి వరుసగా యాత్ర జరిగే పదిహేను రోజులూ… భాజపా జాతీయ నేతలు ఒక్కొక్కరుగా ఒక్కో సభకు వస్తున్నారు. కేంద్రమంత్రులందరూ దాదాపుగా ఈ యాత్రలో వరుసగా పాల్గొంటారని సమాచారం. యాత్రను విజయవంతం చేయాలంటూ ఇప్పటికే జిల్లా పార్టీ శాఖలకు ఆదేశాలు ఇచ్చారట. ఈ బస్సుయాత్రలో ప్రచారాంశాలు ఏంటనేవి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తారట! ఆంధ్రాకు కేంద్రం చేసిన సాయాన్ని కూడా ప్రజలకు వివరిస్తారట..!
ఆంధ్రాకి అన్నీ చేసేశామని ఇప్పటికే భాజపా అంటోంది. ఆ అన్నింటిలో… పోలవరం నిధులు, రాజధాని నిధులు, ప్రత్యేక హోదా, వెనకబడిన జిల్లాల ఆర్థిక సాయం, విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు.. ఇలాంటి కీలకమైనవి ఏవీ కనిపించడం లేదు. కనీసం, ఇప్పుడు బస్సుయాత్రలో భాగంగా రాష్ట్రానికి వస్తున్న కేంద్రమంత్రులైనా వాటిపై స్పష్టంగా మాట్లాడతారేమో చూడాలి. ప్రధాని ఎలాగూ రాలేదు, కనీసం అమిత్ షా అయినా ఏపీ ప్రజలు ఆశిస్తున్న సమాధానాలు చెబుతారో లేదో మరి..! ఏదేమైనా, ఈ యాత్రల్లో ఆంధ్రాకి కేంద్రం చేసిందేంటో, విభజన చట్టంలోని అంశాలు ఎందుకు పెండింగ్ లో ఉండిపోయాయో స్పష్టంగా చెప్పాల్సిందే అనే డిమాండ్ ప్రజల నుంచి భాజపా నేతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.