తెలంగాణ బీజేపీ ఇప్పుడల్లా కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. కిషన్ రెడ్డి కూడా ఎవర్న కంట్రోల్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారంలో పార్టీపై పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బండి సంజయ్ లతో పాటు విజయశాంతి చేసిన వ్యాఖ్యలు పార్టీ తీరు మరింత దిగజారిపోబోతోందనడానికి సూచికల్లా కనిపిస్తున్నాయి.
పార్టీ కోసం అవిశ్రాంతంగా కష్టపడిన తనకు అన్యాయం జరిగిందని బండి సంజయ్ మనసులో ఉందని..తనపై కొంత మంది లేని పోని ఫిర్యాదులు చేశారని ఆయన మనసులో ఉంది. దీన్ని నేరుగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార వేడుక సందర్భంగా చేసిన ప్రసంగంలో వెల్లడించారు. ఇక రాజగోపాల్ రెడ్డి చేసిన హడావుడి వేరే లెవల్. ఆయన కవితను అరెస్ట్ చేయడానకి ఈడీ లంచాలు తీసుకోవడమే కారణమని కూడా ఆరోపించారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన విజయశాంతి మధ్యలోనే వెళ్లిపోయారు. ఎవరూ పట్టించుకోకపోవడంతోనే ఆమె వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది.
కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన వారి మధ్య వివాదాలు ఏర్పడగా.. అసలు కార్యక్రమానికే రాని వాళ్లు ఉన్నారు. యెన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ , ఏనుగు రవీందర్ రెడ్డి వంటి వారు హాజరు కాలేదు. వారంతా పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. రానివారు.. వచ్చిన వారి మధ్య అసంతృప్తిని తక్కువగా అంచనా వేయలేమని బీజేపీ వర్గాలంటున్నాయి. ముందు ముందు బీజేపీలో జరిగే పరిణామాలను అంచనా వేయడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.