గాంధీ బ్రిటిష్ వారి సాయంతో స్వాతంత్ర్య ఉద్యమ నాటకాన్ని ఆడారు.. ఆయన మహాత్ముడేంటి..? … ఇది బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు. ఇంత హఠాత్తుగా ఆయనకు మహాత్ముడిపై కోపం ఎందుకు వచ్చిందో చాలా మందికి అర్థం కాలేదు. కానీ.. ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిసిన వారికి మాత్రం.. అది భావజాలంలో ఉన్న సమస్య అని అర్థమైపోతుంది. హెగ్డే వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో.. తాము సీరియస్ అయినట్లుగా బీజేపీ ప్రకటించింది. ఆయన కు షోకాజ్ నోటీస్ జారీ చేస్తామని చెప్పింది. అనంతకుమార్ హెగ్డే మొదటి సారి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో రాజ్యాంగాన్ని తిరగరాస్తామని ప్రకటించిన వ్యక్తి కూడా. ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. ఆయనను బీజేపీ హైకమాండ్ ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వస్తోంది కానీ… చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు గాంధీజీపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటుందని కూడా ఎవరూ అనుకోవడం లేదు.
బీజేపీలో మహాత్ముడి వ్యతిరేక ప్రకటనలు.. ఇదే మొదటి సారి కాదు.. రాజకీయ నేతగా మారిన సన్యాసిని… ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గత ఎన్నికల సమయంలో కొత్తదారి చూపించారు. ఎన్నికల సందర్భంలో.. గాంధీని చంపిన గాడ్సేని ఆమె పొగిడారు. గాంధీని చంపడం ద్వారానే.. ఆయన నిజమైన దేశభక్తుడయ్యారన్నట్లుగా మాట్లాడారు. అప్పట్లో… ఈ విషయంపై పెద్ద దుమారం రేగింది. మోడీ.. ఇలాంటి వ్యాఖ్యలను చేస్తే సహించబోనని ప్రకటించారు. కానీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత కూడా ఓ సారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆమె మాటలకు మద్దతుగా పలువురు బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు. ఒకరి తర్వాత ఒకరు.. అలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడూ చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు. దాంతో.. హైకమాండ్ ప్రోత్సాహం తమకు ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
బీజేపీ భావజాలంలోనే… గాంధీ వ్యతిరేకత ఉందని.. విపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ ఉంటాయి. దేశ విభజనకు గాంధీ కారణమని.. ఆ పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం.. గాంధీజీని గౌరవిస్తారు. గాంధీని పూజ్యనీయులుగా చెబుతూ… నరేంద్రమోడీ పలు కార్యక్రమాలు చేపట్టారు. స్వచ్చభారత్ .. గాంధీ ఆశయాల సాధనేనని చెబుతారు. ఆ మాటకొస్తే.. తమ పాలన గాంధీ చూపిన మార్గంలో వెళ్తుందని చెబుతూ ఉంటారు. కానీ సొంత పార్టీ కీలక నేతలే దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో… అలాంటి మాటలు మాట్లాడేవారు అంతకంతకూ పెరిగిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.