ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు.. కొద్ది రోజులుగా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. టీడీపీ పని అయిపోయిందని… వైసీపీ సంగతి చూసుకుంటామని.. ఇక తామే ప్రతిపక్ష మని… అంతిమంగా ప్రత్యామ్నాయమని ప్రకటనలు చేస్తున్నారు. అత్యధిక సభ్యత్వాన్ని నమోదు చేసి… ప్రజల్లో ఉన్న ఆదరణను నిరూపిస్తామని అంటున్నారు. ఇప్పటికి సభ్యత్వాన్ని ప్రారంభించి… ఇరవై రోజులు దాటిపోయింది. కానీ.. ఇప్పటి వరకూ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో.. కనీసం సగం సభ్యత్వాలను కూడా.. నమోదు చేయించలేకపోయారు. గత ఎన్నికల్లో అటూ ఇటుగా.. ఏపీలో మూడు లక్షల ఓట్లు బీజేపీకి వస్తే.. ఇప్పటి వరకూ ఆ పార్టీ నేతలు చేసిన సభ్యత్వ సంఖ్య లక్షన్నరలోపే.
అసలు కార్యకర్తలు రెన్యూవల్ చేసుకోవడం లేదా..?
గతంలో.. ఏపీలో మిస్డ్ కాల్ ద్వారా… బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలాంటి మిస్డ్ కాల్స్ తమకు 35 లక్షలు వచ్చాయని.. ఏపీలో 35 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని బీజేపీ నేతలు చెప్పుకున్నారు. ఈ సారి 20 శాతం మందిని అధికంగా చేర్పించాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి మాణిక్యాలరావును ఇన్ చార్జిగా పెట్టింది. అందరూ సభ్యత్వ నమోదు పేరిట… ప్రెస్ మీట్లు పెట్టి… తాము అధికారంలోకి వస్తామని ప్రకటించి.. ముగిస్తున్నారు కానీ… ఎక్కడా యాక్టివ్‌గా ప్రజల్లోకి వెళ్లి సభ్యత్వాల కోసం ప్రయత్నించడం లేదు. దాంతో.. అసలు ఇప్పటికి ఉన్నాయని చెప్పుకుంటున్న 35 లక్షల నుంచి… నాలుగైదు లక్షలకు సభ్యత్వం పడిపోయే ప్రమాదం ఉంది.
వర్గపోరాటంతో ఏపీ బీజేపీ కుదేలు..!
నిజానికి ఏపీ బీజేపీలో.. చాలా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. కన్నా.. ఏపీ బీజేపీ అధ్యక్షుడవడం చాలా మందికి ఇష్టం లేదు. వారంతా… సైలెంట్ గా ఉంటున్నారు. ఈ లోపు సుజనా చౌదరి కొత్తగా పవర్ సెంటర్ గా ఎదిగారు. ఇది రెండు వర్గాలనూ అసంతృప్తికి గురి చేస్తోంది. ఫలితం.. సభ్యత్వ నమోదుపై కనిపిస్తోంది. 150 నియోజకవర్గాల్లో… కనీసం ఇప్పటికి 1000మందిని కూడా కొత్తగా సభ్యులుగా చేర్చుకోలేకపోయారు. ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరించడంతో.. బీజేపీ సభ్యత్వం.. ఒక అడుగు ముందుకు.. వంద అడుగు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది.
చేరిన వాళ్లూ చేర్పించడం లేదు ఎందుకో..?
ఏపీలో బీజేపీకి ఒక్క శాతం ఓట్లు లేకపోయినా… కొంత మందినేతలు వరుస పెట్టి ఆ పార్టీలో చేరిపోయారు. ఏపీకి చెందిన ముగ్గురు టీడీపీ రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు.. ఆ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. అయితే.. వారెవరూ… బీజేపీ సభ్యత్వాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. బీజేపీ నేతల్లో ఇప్పుడిదే పెద్ద హాట్ టాపిక్. టీడీపీ నుంచి వచ్చే వాళ్లు బీజేపీని షెల్టర్ జోన్‌గా చూస్తున్నారు తప్ప పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం లేదంటున్నారు. ఆగస్టు పదకొండో తేదీతో.. సభ్యత్వాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ఆ లోపు .. అనుకున్నది చేస్తారో..లేక.. గత సభ్యత్వాలన్నీ.. కంటిన్యూ చేస్తున్నట్లుగా ప్రకటించేసుకుని.. కొత్త వాటిని లెక్కేసుకుని… సరి పెడతారో మరి..!