తెలంగాణ రాజకీయాలు విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. భారతీయ జనతా పార్టీ నేతలు సైలెంట్ అవుతారని అనుకున్నారు. కానీ.. ఢిల్లీకి వెళ్లిన బండి సంజయ్.. కేసీఆర్ మీద.. ఎన్నికల ముందు కన్నా ఘుటాగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ పొర్లు దండాలు పెట్టినా.. జైలుకు పంపకుండా ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేసేశారు. హైదరాబాద్‌లో ఉన్న కిషన్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. టీఆర్ఎస్తో దోస్తీ చాన్సే లేదని తేల్చేశారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ నేతలు మాత్రం భారతీయ జనతా పార్టీపై సైలెంట్ అయిపోయారు. ఒక్కరంటే ఒక్క మాట మాట్లాడటం లేదు.
రైతులకు మద్దతుగా భారత్ బంద్ ప్రభుత్వ పరంగా చేయించే వరకూ… భారతీయ జనతా పార్టీ నేతలపై టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడేవారు. మోడీ దగ్గర్నుంచి అందర్నీ విమర్శించారు. మోడీపాలనలో దేశం నాశనమైపోయిందన్నారు. వ్యవసాయ చట్టాలు రైతుల్ని ఆగం పట్టిస్తాయని విమర్శలు గుప్పించారు. భారత్ బంద్ పూర్తయిన తర్వాత టీఆర్ఎస్ నేతల నోళ్లకు తాళం పడిపోయింది. వెంటనే కేసీఆర్ ప్రధాని మోడీని సెంట్రల్ విస్టా అంశంపై పొగుడుతూ లేఖ రాశారు. ఆ వెంటనే ఢిల్లీకి వెళ్లారు. ఇప్పుడు.. ఢిల్లీలో జరిగిన చర్చల సారాంశం ఏమిటో క్లారిటీ లేదు. కానీ బీజేపీ నేతలపై మాత్రం విమర్శలు చేయవద్దన్న సంకేతాలు మాత్రం.. టీఆర్ఎస్ నేతలకు అందినట్లుగా తెలుస్తోంది. అందుకే వారు సైలెంట్ అవుతున్నారు.
కానీ బీజేపీ నేతలు మాత్రం.. టీఆర్ఎస్పై తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఓ వైపు బండి సంజయ్ ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి.. కేసీఆర్‌పై విరుచుకుపడితే… హైదరాబాద్‌లో డీకే అరుణలాంటి వారు ఆ బాధ్యత తీసుకున్నారు. కేసీఆర్‌ను విమర్శించడానికి ఏ చిన్న కారణం దొరికినా వదిలి పెట్టాలనుకోవడం లేదు. బీజేపీ నేతలు అన్నన్ని మాటలు అంటున్నా… తాము సైలెంట్‌గా ఉంటే బాగోదని… ప్రతి విమర్శ చేయకపోతే.. లొంగిపోయామన్న భావనకు ప్రజలు వస్తారన్న ఆందోళనలో ఉన్నారు. అయితే కేసీఆర్ మాత్రం సంయమనం పాటించాలన్న సందేశాన్ని నేతలకు పంపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్‌ను కేటీఆర్ కలిశారు. బీజేపీతో తదుపరి యుద్ధమా.. శాంతా అన్నదానిపై కేటీఆర్ నుంచి వచ్చే స్పందనతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.