తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా… ఈసేవా కేంద్రాల వద్దకు.. మహిళలు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ప్రధానమంత్రి స్కూటీ యోజన పథకానికి తమ పేర్లను నమోదు చేయమని పట్టుబడుతున్నారు. అలాంటి పథకం ఏదీ లేదన్నా.. వారు వినిపించుకోవడం లేదు. మోదీ పదో తరగతి చదివిన మహిళలకు.. స్వయంశక్తి సాధించేందుకు… స్కూటీలు ఇస్తున్నారని.. మహిళలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే.. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు.. ఈ పథకం కోసం… ఎంక్వైరీ చేసే మహిళల సంఖ్య పెరిగిపోతోంది. ఈ సేవా కేంద్రాల వద్ద రద్దీ కనిపిస్తోంది. మొదట్లో ఈ ప్రచారాన్ని లైట్ తీసుకున్న భారతీయ జనతా పార్టీ నేతలకు… తేడా కొడుతోందని అర్థమైపోయింది. అందుకే.. వెంటనే.. నష్టనివారణా చర్యలు ప్రారంభించారు.
ప్రధానమంత్రి స్కూటీ యోజన అనే పథకమే లేదని… ప్రత్యేకంగా ప్రెస్మీట్లు పెట్టి చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు.. ఏపీ నాయకులు ముందుగా… ప్రధానమంత్రి స్కూటీ యోజన అనే పథకం లేదని .. సోషల్ మీడియాలో ప్రచారంతో ప్రజలు మోసపోవద్దని చెప్పిన తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. కానీ సోషల్ మీడియా.. ఓ సారి నమ్మితే.. ఇక నిజమే వచ్చి ఎదురుగా నిలబడినా నమ్మే పరిస్థితి ఉండదు. అందుకే.. స్కూటీయోజన పథకం విస్తృతంగా ప్రచారం అవుతోంది. మహిళల్లో..బాలికల్లో ఆశలు రేపుతోంది. ఆ పథకం కోసం.. ఎంక్వైరీలు ఎక్కువైపోయాయి. అంచనాలు పెరిగిపోతూండటంతో.. బీజేపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది.
కొద్ది రోజుల క్రితం.. తమిళనాడు సర్కార్… బాలికలకు స్కూటీలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది. దానికి ప్రధానమంత్రిని ఆహ్వానించారు. ఆయన కూడా… హాజరయ్యారు. అది.. బీజేపీ పథకమే అన్నట్లుగా ప్రసంగించారు. అక్కడే తేడా కొట్టింది. మోడీనే ఇస్తున్నారేమో.. అనేలా.. ప్రధాని ప్రసంగం ఉండటంతో.. ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పథకం ఉంటుందన్న అంచనాలు ప్రారంభమయ్యాయి. ఇదే ప్రధానమంత్రి స్కూటీ యోజన పథకం ప్రజల్లో పుట్టడానికి కారణం అయింది. ఇప్పుడు బీజేపీ నేతలు.. అదంతా ఉత్తదేనని నెత్తినోరు బాదుకుంటున్నా.. వినేవారు లేరు.