ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిత్రపక్షాలుగా ఉన్న తెదేపా-బీజేపీ నేతల మధ్య రాన్రాను యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఇరు పక్షాల నేతలలో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. బీజేపీ నేతలు సోము వీర్రాజు, పురందేశ్వరి, కావూరి, కన్నా లక్ష్మినారాయణ తమ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు మాటకు కట్టుబడి తెదేపా నేతలు ఇంతవరకు మౌనం వహించారు. కానీ ఇప్పుడు వారు కూడా బీజేపీ నేతలకి చాలా ధీటుగా..ఘాటుగా బదులిస్తున్నారు. సోము వీర్రాజు మంత్రి పదవి ఆశించి భంగపడినందునే తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు.
అందుకు సోము వీర్రాజు బదులిస్తూ తెదేపాతో పొత్తు పెట్టుకోవలసిన అవసరమే తమకు లేదని కానీ జాతీయ స్థాయి రాజకీయాల దృష్ట్యా పొత్తులు పెట్టుకోవలసి వచ్చిందని అన్నారు. అసలు గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని తాము అధిష్టానంపై ఒత్తిడి తెచ్చామని కానీ అందుకు అంగీకరించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో తెదేపాతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. తమతో ఎటువంటి పొత్తులు లేకపోయినప్పటికీ తెరాస ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న నిధులతో అమలు చేస్తున్న పధకాల ప్రచార పోస్టర్లలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో వేస్తోందని కానీ మిత్రపక్షం, కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెదేపా ప్రభుత్వం మాత్రం ఎక్కడా మోడీ ఫోటో వేయడం లేదని సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు తమ అధిష్టానం ఒక కమిటీ వేసిందని అందులో తను, లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు, శాంతారెడ్డి సభ్యులుగా ఉన్నామని తెలిపారు. రాష్ర్టంలో బిజెపి బలపడడానికి అవసరమైన ఏ అవకాశాన్ని కూడా తాము వదలబోమని సోము వీర్రాజు అన్నారు.
సోము వీర్రాజు చెప్పిన ఈ మాటలని బట్టి చూస్తే కేంద్రం ఇస్తున్న నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పధకాలలో బీజేపీకి దక్కవలసిన క్రెడిట్ ని బీజేపీకి బదలాయించకుండా దానిని తెదేపా స్వంతం చేసుకొంటోందని, ఆ కారణంగానే సోము వీర్రాజు తదితరులు ఆగ్రహంగా ఉన్నారని అర్ధమవుతోంది. ఈ విషయంలో సోము వీర్రాజు చేసిన ఆరోపణలు నూటికి నూరు శాతం నిజమేనని చెప్పక తప్పదు. కేంద్రం ఇస్తున్న నిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పధకాలను అమలు చేస్తున్నప్పుడు కనీసం రాష్ట్ర బీజేపీ నేతలను ఆహ్వానించడం లేదు. వీర్రాజు ఆరోపిస్తున్నట్లుగానే ఎన్నడూ మోడీ లేదా రాష్ట్ర బీజేపీ నేతల ఫోటోలు, పేర్లు చేర్చలేదు. అవన్నీ తన స్వంత నిధులతో చేపడుతున్న పధకాలుగానే ప్రజలు భావించేలా తెదేపా వ్యవహరిస్తోంది.
తెదేపా ప్రదర్శిస్తున్న ఈ ధోరణి వలన రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అసలు ఏమీ సహాయం చేయడం లేదనే భావన ప్రజలలో కలగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తున్నప్పుడు ఈ ధోరణి వలన ఆ పార్టీ ఎదగడం, బలపడటం సంగతేమో కానీ ప్రజలలో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది కనుక ఇక ఎన్నటికీ తెదేపాకు మిత్రపక్షం (తోక పార్టీ) గానే మిగిలి పోవలసి వస్తుంది. అయిష్టంగానే దానితో కాపురం చేయవలసి వస్తుంది. తెదేపా కనుసన్నలలో మనుగడ సాగించవలసి వస్తుంది.
అందుకే రాష్ట్ర బీజేపీ నేతలు తెదేపా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారని భావించవచ్చును. దాని వలన ఇరు పార్టీలకు తీరని నష్టం జరిగే అవకాశం ఉందని తెలిసి ఉన్నప్పటికీ రాష్ట్రంలో తమ పార్టీ మనుగడ కోసం, ప్రజలలో తమ పార్టీ పట్ల వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకు మిత్రపక్షమయిన తెదేపాతో యుద్దాలు చేయక తప్పడం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత అయిష్టంగా ఉన్నా వచ్చే ఎన్నికల వరకు తెదేపాతో కాపురం చేయకతప్పదు. లేకుంటే ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ వంటి అంశాలను తెదేపా హైలైట్ చేయడం మొదలుపెడుతుంది. రాజధాని నిర్మాణం లేదా రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలు ఏ కారణంగా ఆలస్యమయినా కూడా కేంద్ర ప్రభుత్వ సహకరించకపోవడం వలననే ఆగిపోయాయని ప్రచారం మొదలుపెట్టవచ్చును. దాని వలన నష్టపోయేది బీజేపీయేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఈ కలహాల కాపురం అలా సాగిపోవలసిందే మరో మూడున్నరేళ్ళు.