తెదేపా ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక హోదా విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో రాష్ట్రంలో తెదేపా-బీజేపీ నేతల మద్య యుద్ధం మొదలయింది. బీజేపీ తరపున సోము వీర్రాజు బాణాలు వేస్తుంటే, తెదేపా తరపున ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ బాణాలు సంధించారు. ఆ తంతు ముగిసిన తరువాత యధాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలని మిత్రపక్షమయిన బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. తెదేపా-బీజేపీల మధ్య పరస్పర అవగాహన కల్పించేందుకు ఇరు పార్టీ నేతలతో కూడిన ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం దేనిదారి దారి దానిదే అన్నట్లుగా సోము వీర్రాజు నేతృత్వంలో తెదేపా నేతలపై, ప్రభుత్వంపై కత్తులు దూస్తూనే ఉన్నారు.
తెదేపా ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ సోము వీర్రాజుని విమర్శించడాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాక వెంకటసత్యనారాయణ ఖండించారు. నిన్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బీజేపి నిర్వహించిన ఒక పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి మోడీ ప్రభుత్వం సహకారం అందిస్తునప్పటికీ తెదేపా నేతలు మోడీని, కేంద్రప్రభుత్వం విమర్శించడం సరికాదు. తెదేపా ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న కారణంగానే వారు ఏవిధంగా మాట్లాడుతున్నప్పటికీ మేము సంయమనం పాటించవలసివస్తోంది,” అని అన్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు నిన్న గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు కేంద్రం నుండి భారీగా నిధులు తెచ్చుకొంటూనే, మళ్ళీ కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదని తెదేపా నేతలు చెప్పుకోవడం సిగ్గు చేటు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నీరు- చెట్టు పథకంలో ఎంత అవినీతి జరిగిందో మాకు తెలుసు. బీజేపీ నేతలను తప్పు పడుతున్న తెదేపా నేతలు, దైర్యం ఉంటే ఆ పధకంలో అవినీతి గురించి మాట్లాడితే బాగుంటుంది,” అని ఎద్దేవా చేసారు.
సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోడి రాష్ట్రాభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు. కానీ కొందరు టీడీపీ నాయకులే ఆయన దిష్టి బొమ్మలను దగ్దం చేస్తుంటే తెదేపా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోంది? దానిని మేము ఏవిధంగా అర్ధం చేసుకోవాలి? మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే పోలవరానికి ఉన్న అడ్డంకులు తొలగించారు. రాష్ట్రానికిని నిరంత విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టుని మంజూరు చేసారు. తద్వారా రాష్ట్రానికి కొత్తగా అనేక పరిశ్రమలు వస్తున్నాయి. గతంలో ఏ ప్రభుత్వమూ చేయనివిధంగా రాష్ట్రానికి 16 నెలల వ్యవధిలోనే ఐదు ఉన్నత విద్యాసంస్థలను కేంద్రం మంజూరు చేసింది. అమరావతి మాష్టర్ ప్లాన్ కూడా రాకముందే రాజధాని నిర్మాణం కోసం వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇన్ని చేస్తున్నా ఇంకా ప్రధాని నరేంద్ర మోడి పట్ల తెదేపా నేతలు చాలా అవమానకరంగా మాట్లాడటం సరికాదు,” అని అన్నారు.