కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనాథలా వదిలేస్తూ వంచిస్తున్నదని ఒకవైపు రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కారును గట్టిగా నిలదీయలేని దుర్భర స్థితిలో చంద్రబాబు సర్కారు కొట్టుమిట్టాడుతోందని.. తెదేపా మీదికి కూడా జనాగ్రహం మళ్లుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ కాలం ఇలాంటి మౌనముద్ర మొదటికి మోసం తెస్తుందనుకుంటున్న తెలుగుదేశం.. కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాలనే ఆలోచనలు కూడా చేస్తున్నట్లు కొన్ని సంకేతాలు వస్తున్నాయి. కేంద్రంతో తెగతెంపులకైనా సిద్ధం అని భావం తెలియజెప్పేలా.. సాయం గురించి చంద్రబాబు స్వయంగా ఒక లేఖ రాయాలనుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి సంక్లిష్టమైన నేపథ్యంలో రాష్ట్రంలోని తెలుగుదేశం సర్కారు మీద భాజపా నాయకులు మాటలతో దాడి చేయడం కాస్త శృతి మించుతోంది. ఇదివరలో ఏదో కొందరు నాయకులు మాత్రం తరచూ చంద్రబాబును తిట్టిపోస్తూ ఉండేవారు. సోమువీర్రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటివారినుంచే విమర్శలుండేవి. వారందరికీ బాబును తిట్టడానికి విడివిడిగా వేరు కారణాలున్నాయి గనుక పెద్ద పట్టింపు లేదు. అయితే ఇప్పుడు కేంద్రం ఇస్తున్న నిధుల్నిచంద్రబాబు ఇతరత్రా వాడుకుంటున్నాడని.. కేంద్రంపై దురభిప్రాయం జనంలో కలిగిస్తున్నాడని ఆడిపోసుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. తాజాగా భాజపా నేత కోటేశ్వరరావు మాట్లాడుతూ.. కొత్త రాజధానిలో రాజ్‌భవన్, అసెంబ్లీ నిర్మాణాలకు కేంద్రం 500 కోట్లు ఇస్తే.. ఆ నిధుల్ని ఇతర అవసరాలకు చంద్రబాబు మళ్లించారని ఆరోపించారు. పోలవరం నిధులపై ఏపీ సరిగా వ్యవహరించడం లేదంటూ పురందేశ్వరి తరహాలోనే విమర్శలు గుప్పించారు. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనుల్లో బోలెడు అవినీతి అంటూ దెప్పిపొడవడం మరో విశేషం.
ఇలా కమలనాధులు తెదేపాను తిట్టడానికి గళం పెంచడం గమనిస్తోంటే.. వారికి కేంద్ర నాయకత్వం నుంచి ప్రత్యేక సంకేతాలు ఏమైనా అందుతున్నాయా అనే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో తెదేపాతో తెగతెంపులు బెటర్ అనే భావనకు భాజపా వస్తున్నదా అని కూడా పలువురు భావిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖకు కొత్తగా అధ్యక్ష నియామకం జరగాల్సి ఉంది. ఆ పీఠంపై ఎవరిని కూర్చోబెడతారో, రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి ఇస్తారనేదానిపై తెదేపాతో కేంద్రం కోరుకుంటున్న సంబంధాల విషయంలో క్లారిటీ వస్తుందని పలువురు అంటున్నారు.