ఇదేమీ మునిసిపల్‌ఎన్నికల ఫలితాల విశ్లేషణకు సంబంధించిన విశ్లేషణ కాదు. కానీ అంతకంటె చాలా కీలకమైనది. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత రాజకీయ సమీకరణాలు, పునరేకీకరణలకు సంబంధించినది అని అనుకోవచ్చు. అవును మరి.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ.. అసలు ఉనికి , అస్తిత్వం లేకుండా మాయం అయిపోతున్న వేళ.. స్వతంత్రంగా పెద్దగా బలం లేని భారతీయ జనతా పార్టీ.. ప్రత్యామ్నాయంగా అధికార తెరాసవైపు మొగ్గితే ఆశ్చర్యం ఏముంది? అనిపించే సంకేతం ఇది. అచ్చంగా కేసీఆర్ సర్కారును నెత్తిన పెట్టుకోవడం కాదు గానీ.. కేసీఆర్ పట్ల తమలో ఎలాంటి అసంతృప్తి లేదని, ఆయన పాలన అద్భుతాలు సృష్టిస్తున్నదని ప్రజలకు తెలియజెప్పేలా భాజపా శ్రేణులు వ్యవహరించడం మాత్రం ఒక రకంగా ఆసక్తి కరమే.
వివరాల్లోకి వెళితే…
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో కలిసి సంతకాలు చేసి.. ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ కు గోదావరి తదితర నదుల మీద కొత్త ప్రాజెక్టులు రావడానికి ఒప్పందాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణ సాగునీటి వనరుల పరంగా… ఆయకట్టులో లక్షల ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కల్పించే పరంగా ఇది చాలా పెద్ద ముందడుగు అని చెప్పాల్సిందే. తెరాస శ్రేణులు ఈ విషయాన్ని చాలా పెద్దస్థాయిలో సెలబ్రేట్ చేశాయి కూడా.
అయితే తమాషా ఏంటంటే.. బీజేవైఎం నాయకులు కోరుట్లలో ఈ అంశానికి సంబంధించి కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టేశారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు తమ పార్టీకి చెందిన మహారాష్ట్ర గవర్నరు విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ ల ఫోటోలకు పాలాభిషేకం.. వారిద్దరినీ తెలంగాణ జలప్రదాలుగా అభివర్ణిస్తూ పెద్ద హడావిడి చేశారు. విద్యాసాగర్‌రావును వారి పార్టీనే గనుక.. కీర్తించుకోవడంలో వింత లేదు. కాకపోతే.. కేసీఆర్‌కు కూడా పాలాభిషేకం చేసి ఆయనను అంతగా కీర్తించడం అనేది ఆసక్తికరం.
తెలంగాణలో గులాబీ పార్టీ, కమలదళంతో అప్రకటిత స్నేహాన్ని కొనసాగిస్తున్నదనే పుకార్లు చాలా కాలంగాఉన్నాయి. పార్లమెంటులో గులాబీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు కూడా అలాగే కనిపిస్తోంది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం అని వారంటారు గానీ.. వారి తీరు మిత్రపక్షం లాగానే సాగుతున్నది. ఈ నేపథ్యంలో.. కేసీఆర్‌ను ఇంతగా బీజేవైఎం కీర్తించడం.. పాలాభిషేకాలు లాంటి సంకేతాలు.. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఈరెండు పార్టీల మధ్య పుట్టబోయే మైత్రికి సంకేతాలు అని పలువురు అభివర్ణిస్తున్నారు.