కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర ప్యాకేజీ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు బీజేపీ నేతలకు ఆగ్రహాన్ని తెప్పించింది. కేసీఆర్ భాష మార్చుకోవాలని మండిపడుతూ..వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్రకటనలు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ భాషను నేను ఉపయోగించను..అలాంటి శక్తి కూడా తనకు లేదని సెటైన్ వేసారు. విద్యుత్ రంగంలో అవినీతిని నిర్మూలించేందుకు సంస్కరణలు అవసరమని .. తెలంగాణలో తీసుకొస్తున్న పంటల విధానాన్ని కేంద్రం వ్యతిరేకించడం లేదని గుర్తు చేసారు.కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలను మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.
విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు రాకుంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని కిషన్రెడ్డి కేసీఆర్ ని ప్రశ్నించారు. ప్యాకేజీ భోగస్ అని అంతర్జాతీయ జర్నల్స్ రాశాయన్న కేసీఆర్ విమర్శలపై కిషన్ రెడ్డి స్పందించారు. మోదీ వెనుక దేశమంతా ఉందని న్యూయార్క్ టైమ్స్ సహా.. 50 అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయని కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. అడ్రస్ లేనివాళ్లు చెబితే ప్రధానిని విమర్శించడం కేసీఆర్కు తగదని … కేసీఆర్ సంకుచితభావంతో పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. దేశం పరువుతీసేలా కొందరు విపక్ష నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కూడా.. కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రెచ్చగొట్టి మాట్లాడే మతిలేని నాయకుడని సోము వీర్రాజు విమర్శించారు. కొంచెం చుక్క ఎక్కువై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లాక్ డౌన్ ప్రారంభమయినప్పటి నుండి కేంద్రంపై చాలా సానుకూలంగా మాట్లాడిన కేసీఆర్… ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మాత్రం..ఒక్క సారిగా రూు మార్చేశారు. దాంతో.. బీజేపీ నేతల్లోనూ కలవరం ప్రారంభమయింది.