బిల్లుల విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ విషయంలో బీజేపీ తీవ్రంగా విబేధిస్తోంది. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్ లా వ్యవహరిస్తోందని ఇక చట్టసభలతో పనేముందని ఆ పార్టీ ఎంపీలు రోజుకొకరు చొప్పున విమర్శలు గుప్పిస్తున్నారు. మొదటగా కేరళ గవర్నర్ .. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఎడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే వారిద్దరూ సాంకేతికంగా రాజకీయాలతో సంబంధం లేనివారు. పైగా రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు. దీంతో వారి ప్రకటనలపై ఇతరులు ఆచితూచి స్పందిస్తున్నారు.
ఈ లోపు బీజేపీ ఎంపి నిశికాంత్ దూబే ఓ అడుగు ముందుకేశారు. సుప్రీంకోర్టు తన పరిధికి మించి వ్యవహరిస్తోందని, దేశంలో మత పోరాటాలకు ప్రేరణకు బాధ్యత వహించాలన్నారు. దూబే వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నేరుగా సుప్రీంకోర్టు తీర్పులపై ఇటీవలి కాలంలో ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు కాస్త గీత దాటినట్లుగా ఉండటంతో .. రాజకీయ నేతలు అసలు వదిలి పెట్టడం లేదు.
తాజాగా నిశికాంత్ దూబేపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కొంత మంది లాయర్లు సుప్రీంకోర్టును కోరారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఏదో ఒకటి చేయాల్సి ఉంది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ చేయబోతున్నారు. వక్ఫ్ బిల్లుపై విచారణ సుప్రీంకోర్టులో సాగుతోంది. అదే సమయంలో ఇప్పటికే ఆ బిల్లపై స్టేటస్ కో ఇచ్చారు. అందుకే బీజేపీ నేతల వ్యాఖ్యలతో సుప్రీం ప్రతి స్పందన ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి ప్రారంభమయింది.