బెంగాల్లో బీజేపీ నేతలు కంట్రోల్ తప్పిపోతున్నారు. మమతా బెనర్జీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మమతా బెనర్జీ కాలికి కట్టుతోనే ప్రచారం చేస్తూండటం బీజేపీ నేతల్ని అసహనానికి గురి చేస్తోంది. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ నామినేషన్ రోజున తనపై దాడి జరిగిందని మమతా బెనర్జీ ఆరోపించారు. కాలికి దెబ్బ తగలడంతో రెండు రోజులు ఆస్పత్రి ఉండి.. ఆ తర్వాత వీల్ చైర్లో ప్రచారం ప్రారంభించారు. అప్పట్నుంచి వీల్ చైర్లోనే… కాలికి కట్టు అందరికీ కనిపించేలా ప్రచారం చేస్తూండటంతో బీజేపీ నేతలు… విమర్శలు ప్రారంభించారు.
బెంగాల్ బీజేపీ చీఫ్ .. దిలిప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మమతా బెనర్జీ కాలి కట్టు ఇంకా బాగా కనిపించేలా ఉండాలంటే బెర్ముడా షార్ట్స్ వేసుకోవాలని ఓ సారి సలహా ఇచ్చారు. మరోసారి మమతా బెనర్జీ.. కాళ్లను చూపిస్తూ.. బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల్ని కించ పరుస్తున్నారని విమర్శిస్తున్నారు. దిలీప్ ఘోష్ విమర్శలు వివాదాస్పదమవుతున్నాయి. ఆయనపై … తృణమూల్ నేతలు విరుచుకుపడుతున్నారు. బీజేపీ నేతల తీరే అంత అని మండి పడుతున్నారు. మమతా బెనర్జీ వీల్ చైర్లోనే ప్రచారం చేయడంతో ఆమెకు ప్రజల్లో ఎక్కడ సానుభూతి వస్తుందోనని.. బీజేపీ నేతలు ఆందోళన చెంది.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
బీజేపీ నేతల అసహనాన్ని టీఎంసీ నేతలు మరింత ఎక్కువగా రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. వారు మహిళల్ని కించపరుస్తున్నారని.. గౌరవించడం లేదని అంటున్నారు. మమతా బెనర్జీ కూడా బీజేపీ నేతల తీరును ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. చిన్న గాయానికే… పెద్ద కట్టు కట్టుకుని సానుభూతికోసం మమతా బెనర్జీ డ్రామాలాడుతున్నారనేది… బీజేపీ నేతల బాధ. దాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియక… వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మహిళల్లో వ్యతిరేకత పెంచుకుంటున్నారు.