టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తామని ఆశలు పెట్టుకున్న కొంత మంది బీజేపీ నేతల ఆశలు అడియాశలు అయినట్లుగా కనిపిస్తోంది అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల ఆఫీసులు ప్రారంభించాలని ఆ పార్టీ నేతలకు హైకమాండ్ ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయం దగ్గర పడింది. ఈ నెల చివరి వారానికల్లా ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తున్నారు. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తవుతాయి.
ఇప్పుడు పొత్తులకు సమయం లేదని ఒంటరిగా పోటీ చేయడమే మిగిలిందని భావిస్తున్నారు. అయితే బీజేపీ నుంచి వస్తున్న సిగ్నల్స్.. ఇతర కారణాల వల్ల టీడీపీ, జనసేన అంతర్గతంగా సీట్లను సర్దుబాటు చేసుకున్నప్పటికీ.. అధికారికంగా ప్రకటించలేకపోతున్నారు. బీజేపీ ప్రేమిస్తే ప్రేమించాల్సిందే అన్న పరిస్థితి ఉంది. ఒక వేళ బీజేపీ కూడా కూటమిలో చేరితే.. ఆ పార్టీకి కొన్ని సీట్లు కేటాయించాలి. అయితే పొత్తులు ఉంటాయని ఇప్పటికీ కొంత మంది బీజేపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఒకటి, రెండు పార్లమెంట్ సీట్లకు అయినా పరిమితమయ్యేందుకు రెడీగా ఉన్నారు.
పురందేశ్వరి రాజమండ్రి స్థానంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెబుతున్నారు. అలాగే కొన్ని అసెంబ్లీ సీట్ల విషయంపైనా చర్యలు తీసుకుంటున్నారు. పొత్తులు కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. పొత్తులు పెట్టుకున్నా సీట్లు రావనుకునే ప్రో వైసీపీ బ్యాచ్ మాత్రం పొత్తులు వద్దనుకుంటున్నారు. జనసేనతో పొత్తు ఉందని పదే పదే బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇలా ఎందుకు అన్నది మాత్రం.. అర్థం కావడం లేదు. బహుశా.. జనసేనకు కేటాయించే సీట్ల నుంచే.. బీజేపీ తీసుకుని పోటీ చేస్తుందేమో అన్న సెటైర్లు కూడా ఈ కారణంగానే వినిపిస్తున్నాయి.