ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తాను పెట్టనివ్వదు.. కేంద్రాన్ని పెట్టనివ్వదు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే… ఏపీ సర్కార్ రైతులకు ఎంత పరిహారం ఇస్తామో ఇంత వరకూ ప్రకటించలేదు. అదే సమయంలో కనీసం కేంద్ర సాయానికైనా ప్రయత్నిస్తున్నారా .. అంటే అదీ లేదు. ఓ లేఖ రాసి సైలెంటయిపోయారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ కు కేంద్ర బృందం వచ్చింది. కానీ ఏపీ గురించి పట్టించుకున్న వారు లేదు. తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని తెలంగాణకు కేంద్ర బృందాన్ని తీసుకు వచ్చారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదికలు సమర్పించింది.
పంట నష్టం అంచనా వేసిన తర్వాత.. కేంద్రం తెలంగాణకు నిధులు మంజూరు చేస్తుంది. అయితే ఏపీ సర్కార్ ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదు. దీంతో ఏపీ బీజేపీ నేతలు.. ప్రజలు తమను నిందిస్తారని భయపడ్డారేమో కానీ.. తామే కేంద్రమంత్రికి … నష్టం అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని కోరుతూ.. విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రితో ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అకాల వర్షం వల్ల జరిగిన పంట నష్టాన్ని జరిగిందని.. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఆశాజనకంగా లేవని వారు కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు.
కేంద్ర బృందాన్ని పంపి పంటనష్టాన్ని అంచనావేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని మీడియా సమావేశం పెట్టి జీవీఎల్ నరసింహారావు వివరించారు. బీజేపీ నేతలకు అటు ఏపీ సర్కార్ను గట్టిగా విమర్శించలేక … ఏమీ చేయట్లేదని విమర్శలు వచ్చేలా చూసుకోలేక..బీజేపీ నేతలు తంటాలు పడుతున్నారు. ఏదో మాట వరసకు విజ్ఞప్తి చేశారో… వారి మాటకు విలువ ఇచ్చి ఏపీ కి కేంద్ర బృందాన్ని పంపుతారో.. వేచి చూడాలి..!