ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి మరోసారి దెబ్బపడింది. కైరానా ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భంగపాటు తప్పలేదు. సరిగ్గా, రెండు నెలల కిందట.. అంటే మార్చిలో కూడా భాజపా కంచుకోట అనుకున్న యూపీలో ఫుల్ పూర్, గోరఖ్ పూర్ ఎంపీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో భాజపాకి ఓటమి తప్పలేదు. అయితే, ఆనాటి ఓటమిపై భాజపా తక్షణ స్పందన ఏంటంటే… యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ వైపు భాజపా పెద్దలంతా వేలు చూపారు! ఆయన అతి విశ్వాసంతో వ్యవహరించారనీ అందుకే ఓటమి తప్పలేదన్నారు.
చివరి నిమిషంలో ఎస్పీ బీఎస్పీలు ఏకమౌతాయని ఊహించలేకపోయామనీ, వారి కూటమికి ధీటుగా రియాక్ట్ అయ్యేందుకు భాజపా దగ్గర సమయం లేకపోయిందనీ విశ్లేషించుకున్నారు. ఇక, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అయితే… ఉప ఎన్నికలు అనేవి స్థానిక అంశాల ప్రభావంతో జరుగుతాయనీ, ఉప ఎన్నిక ద్వారా ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడవు అని ఓటర్లుకు తెలుసనీ, అందుకే ఆ ఫలితాలను మోడీ నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇచ్చిన తీర్పుగా చూడకూడదన్నారు. యూపీలో జరిగిన నాటి రెండు స్థానాల ఎన్నికలూ 2019లో మోడీ నాయకత్వం ప్రాతిపదికన జరిగినవి కావని కొట్టిపారేశారు.
సరే, ఇప్పుడు అమిత్ షా ఏమంటారు మరి..? కైరానాలో కూడా భాజపా ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు కలిసి పోటీకి దిగుతాయని ముందే తెలుసు కదా! ఇదేమీ అనూహ్య కలయిక కాదు. కైరానా ఎన్నిక విషయంలో యోగీ ఆదిత్యనాథ్ బాగానే జాగ్రత్త పడుతూ వచ్చారు. అతి విశ్వాసానికి వెళ్లలేదు. చివరికి, ప్రధాని కూడా కైరానా చెరుకు రైతుల్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయినాసరే ఓటమి తప్పలేదే..! ఈ ఎన్నికల్లో ప్రజలు కేవలం స్థానిక అంశాలనే దృష్టిలో పెట్టుకుని, మోడీ పాలన గురించి ఆలోచించకుండా ఓటింగ్ కి వెళ్లారా..? ఈ ఫలితాన్ని అమిత్ షా ఎలా విశ్లేషిస్తారో చూడాలి.
ఇంకోటి, ప్రతిపక్షాల ఐక్యత అన్నిసార్లూ సాధ్యం కాదనీ ఈ మధ్యనే అమిత్ షా సూత్రీకరించారు. 2019 ఎన్నికల్లో పార్టీల కూటమి సాధ్యం కాదనీ, అందరూ ఒక గొడుగు కింద ఇమడలేరనీ అన్నారు. కానీ, భాజపాయేతర పార్టీల ఒకేఒక బలమైన లక్ష్యం భాజపాకి మరోసారి అధికారం దక్కకుండా చేయడం. ఈ కామన్ పాయింట్ తో రోజురోజుకీ పార్టీల మధ్య ఐక్యత పెరుగుతోందన్నది మరోసారి రుజువైంది.