తెలంగాణలో రెండు స్థానాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి పెద్ద షాక్ ఇచ్చాయి. తెలంగాణలో తానే బలమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకునే బిజెపికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు “సంచి లాభం చిల్లు లో పోగొట్టుకున్నట్లు” చేసాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
దుబ్బాక, జిహెచ్ఎంసి తో జోరు పెంచిన బీజేపీ:
2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెద్దగా లెక్కలోకి కూడా రాలేదు. అయితే 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో 4 ఎంపీ సీట్లు సాధించి ఒక్కసారిగా రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్య పరిచింది. అయితే అక్కడితో ఆగకుండా దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకోవడం రాజకీయ సమీకరణాలు మార్చివేసింది. దానికి కొనసాగింపుగా జిహెచ్ఎంసి ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ కు ఒంటరిగా మెజారిటీ రాకుండా చేయడం లో బీజేపీ సఫలీకృతం కావడంతో బిజెపి ఇమేజ్ తెలంగాణలో ఒక్కసారిగా పెరిగింది. రానున్న ఎన్నికలలో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం అంటూ తెలంగాణ బిజెపి నేతలు బలమైన వ్యాఖ్యలు చేశారు.
రెండు విజయాలకే తెలంగాణ బిజెపి విర్రవీగుతూ ఉందనే అభిప్రాయం కలిగించిన బీజేపీ నేతలు:
ఈ నేపథ్యంలో తెలంగాణలో 2 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకటించబడ్డాయి. అయితే పెరిగిన ఇమేజ్ ను సరిగ్గా హ్యాండిల్ చేసుకోవడంలో బీజేపీ నేతలు ఘోరంగా విఫలం అయ్యారు. దుబ్బాక ఎన్నికల సమయంలో బండి సంజయ్ అధికార పార్టీ పై చేసిన పరుషమైన వ్యాఖ్యానాలకు జై కొట్టిన జనాలే తాజాగా బండి సంజయ్ చేస్తున్నవి అర్థం పర్థం లేని వ్యాఖ్య లని తప్పుపడుతున్నారు.
ఇక హైదరాబాద్ ప్రాంతంలో పోటీ చేసిన బిజెపి నేత రామచంద్ర రావు కూడా కాస్త అహంభావంతోనే మాట్లాడారు. ఐదేళ్ల కిందట తెలంగాణలో బిజెపి హవా పెద్దగా లేని రోజుల్లోనే తాను గెలిచానని, ఇప్పుడు బిజెపి హవా కూడా పెరగడంతో తన గెలుపు సునాయాసం అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక ఖమ్మం ప్రాంత ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి నాలుగో స్థానం తో సరిపెట్టుకోవలసి వచ్చింది. స్వతంత్ర అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిస్తే, ప్రొఫెసర్ కోదండరామ్ మూడో స్థానంలో నిలిచారు. వీరిద్దరి కంటే బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి వెనకబడడం బిజెపి నేతలకు మింగుడు పడడం లేదు.
చివరి నిమిషంలో టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్
దుబ్బాక ఎన్నికల సమయానికి తెలంగాణ బిజెపి కి మీడియాలో ఇప్పుడున్నంత కవరేజ్ ఉండేది కాదు. పూర్తిగా సోషల్ మీడియా పై ఆధారపడి బిజెపి దుబ్బాక రాజకీయం నెరిపింది. ఆ సమయంలో బిజెపి తో పాటు ఆ పార్టీతో ఆంధ్ర లో పొత్తు లో ఉన్న జనసేన అభిమానులు కూడా సోషల్ మీడియాలో రఘునందన్ రావు కి మద్దతుగా ప్రచారం చేశారు. మొత్తంమీద దుబ్బాక లో వెయ్యి ఓట్లు తేడాతో బిజెపి సీటు గెలుచుకుంది. అయితే ఇంతలో వచ్చిన జిహెచ్ఎంసి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కి బిజెపి కి మధ్య ఉన్న గ్యాప్ బయటపడింది. జిహెచ్ఎంసి లో బిజెపి, మునుపటి తో పోలిస్తే బాగానే పెర్ఫామ్ చేసినప్పటికీ, సెటిలర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టిఆర్ఎస్ పై చేయి సాధించింది. అయితే తెలంగాణ బిజెపి కి జనసేన కి గ్యాప్ పెరగడంతో సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల రోజున పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీకి షాక్ ఇస్తూ టిఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవి కి మద్దతు ప్రకటించారు. ఖమ్మం సిట్టింగ్ స్థానం కావడంతో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ మొదటి నుండి అనుకూలత ఉండేది. కానీ హైదరాబాద్ బిజెపి నేత రామచంద్ర రావు సిట్టింగ్ స్థానం కావడంతో నిజానికి వాణి దేవీ విజయావకాశాలపై భిన్నాభిప్రాయాలు ఉండేవి . కానీ, కారణాలు ఏవైనా వాణి దేవి బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు ని ఓడించి సీటు కైవసం చేసుకున్నారు.
మొత్తం మీద:
ఇటీవలి దుబ్బాక ,జిహెచ్ఎంసి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించి జోరుమీద ఉన్న భారతీయ జనతా పార్టీ, ఎమ్మెల్సీ ఎన్నికల లో కూడా గెలిచి ఉంటే అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో డిఫెన్స్ లో పడిపోయి ఉండేది. ఈ ప్రభుత్వం తదుపరి ఎన్నికలలో గెలవడం అసాధ్యం అన్న అభిప్రాయం ప్రజలలో చొప్పించడానికి బీజేపీకి అవకాశం ఉండేది. అయితే టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయిన ఖమ్మం ప్రాంతం లోనే కాకుండా, బిజెపి సిట్టింగ్ స్థానం అయిన హైదరాబాద్ ప్రాంతం లో కూడా ఓటమి ఎదురుకావడం తో ఆ అవకాశం కోల్పోవడమే కాకుండా, దుబ్బాక జిహెచ్ఎంసి ఫలితాలతో వచ్చిన హైప్ కూడా బలహీనం అయ్యే పరిస్థితి ఉండడంతో బీజేపీకి దుబ్బాక, జిహెచ్ఎంసి “సంచి లో వచ్చిన లాభం” ఎమ్మెల్సీ “చిల్లులో పోయినట్లయింది”.