ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఒక్క రాష్ట్రామూ దక్కలేదు. అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలను పోగొట్టుకోవడమే కాదు.. మిజోరం, తెలంగాణల్లో ఒక్కొక్క సీటు మాత్రమే సాధించి పరువును రోడ్డున పడేసుకుంది. నరేంద్ర మోదీ, అమిత్ షా దూకుడుకు హిందీ బెల్ట్ లో బ్రేక్ పడింది. ఛత్తీస్ ఘఢ్ , రాజస్థాన్, మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఊహించిన ఫలితాలు రాలేదు.మోదీ జైత్రయాత్రకు హిందీ బెల్ట్ విజయాలే అండదండగా నిలిచాయి. ఉప ఎన్నికల్లో ఘోర పరాజయాలు మోదీ ప్రభ తగ్గిందనే చెప్పాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాన్ని మరింత స్పష్టం చేశాయి.
కాంగ్రెస్ ముక్త భారత్ అని పిలుపు ఇచ్చిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ చేతిలోనే ఓటమి పాలయింది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై మోదీ , షా సర్వ శక్తులూ ఒడ్డారు. చివరకు మాయావతి మీద కూడా కేంద్ర సర్కారు ఒత్తిడి పనిచేసింది. ఆమెతో విడిగా పోటీ చేియంచారు. మోదీ ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే మాయావతి ఛత్తీస్ ఘర్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో పొత్తుకు విముఖత చూపారు. కానీ ఈ గండాన్ని కూడా కాంగ్రెస్ అధిగమించింది. బీజేపీకి హిందీ బెల్ట్‌లో ఇదే ఎదురుగాలి కొనసాగితే లోక్ సభ ఎన్నికల్లో చేదు అనుభవాలు తప్పవు. హిందీ బెల్ట్ లో … మరీ ముఖ్యంగా కాంగ్రెస్ తో ముఖాముఖీ తలపడే రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి బీజేపీ కొంపముంచుతుంది.
బీజేపీ వ్యూహాలు పారడం లేదని.. తాజా ఫలితాలు చూసి అంచనా వేయవచ్చు. ఎన్నికల్లో అభివృద్ధి అంశం పైనే ఎక్కువగా చర్చ జరిగింది. రైతుల సమస్యలు ఎక్కువగా చర్చకు వచ్చాయి. ఆరెస్సెస్ చేపట్టిన రామాలయం నిర్మాణం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో ఎక్కడా కనిపించలేదు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపించడానికి అవకాశం ఉంది. ఈ గండం నుంచి గట్టెక్కడానికి ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బ తీయడానికి మోదీ సర్వ శక్తులూ ఒడ్డుతారు. అందుకోసం మాయావతి పార్టీని, కేసీఆర్ ను కూడా మోదీ ఉపయోగిస్తారన్న అంచనాలు ఉన్నాయి. ఈ పరిణాలు.. హిందీ బెల్ట్‌లో… మోడీని కాపాడతాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే…!