కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కర్ణాటకలో మూడు పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు. అసెంబ్లీ స్థానాల సంగతేమో కానీ.. ఆరు నెలల పదవి కాలం మాత్రమే ఉన్న పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటనేది ఎవరికీ అర్థం కాలేదు. అదే సమయంలో ఏపీలో ఐదు లోక్సభ స్థానాలు ఖాళీగా ఉంటే సాంకేతిక కారణాలు చెప్పి.. షెడ్యూల్ ప్రకటించలేదు. దీన్ని బట్టి చూస్తే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు…ఆ ఉపఎన్నికలతో ఓ పొలిటికల్ గేమ్ ఆడాలని బీజేపీ ప్రణాళిక వేసుకుందని మాత్రం.. రాజకీయవర్గాలకు అర్థమయింది.
ఉపఎన్నికల్లో సులువుగా గెలిచేస్తామని.. కాంగ్రెస్, జేడీఎస్ కలహించుకుంటాయని… ఆ ప్రభావం పోలింగ్ పై పడుతుందని ఆశించింది. కూటముల్లో రాజకీయం తేడాగా ఉంటుందని దేశవ్యాప్తంగా ప్రజలకు చూపించొచ్చని వ్యూహం పన్నింది. అలాగే.. మూడు పార్లమెంట్ స్థానాల్లో రెండు బీజేపీ కంచుకోటలు. ఒకటి షిమోగా.. రెండు బళ్లారి. ఈ రెండింటింలో.. భారీ మెజార్టీతో గెలిచి… బీజేపీ వేవ్ ఉందని నిరూపించాలనుకున్నారు. కానీ .. బీజేపీ వ్యూహం అడ్డం తిరిగింది. కాంగ్రెస్, జేడీఎస్ కలహించుకోలేదు. పద్దతిగా సీట్లు పంచుకున్నాయి. ఇప్పుడు స్వీట్లు పంచుకున్నాయి. ఇంకా చెప్పాలంటే.. కంచుకోటలనుకున్న బళ్లారి, షిమోగాల్లో బీజేపీకి షాక్ తగిలిగింది. బళ్లారిలో రెండున్నర లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఓడిపోగా.. షిమోగాలో యాభై వేల ఓట్ల తేడాతో గెలిచారు. కానీ.. గత పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ బీజేపీ అభ్యర్థి అయిన యడ్యూరప్పకు వచ్చిన మెజార్టీ మూడున్నర లక్షలు. ఇప్పుడు మూడు లక్షల ఓట్ల కోత పడింది.
జమాఖండి అనే అసెంబ్లీ స్థానంలో బీజేపీకి పట్టు ఉంది. గెలిచేస్తామని.. ఆ సీటు గెలిస్తే… కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను చీల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్లేసుకున్నారు. యడ్యూరప్ప కూడా… నెలలో ప్రభుత్వం మారుతుందని ప్రకటలు చేశారు. కానీ… ఫలితం మొత్తం తేడా కొట్టింది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. కాంగ్రెస్, జేడీఎస్ సంయుక్త ప్రకటన చేశాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కూటమిగా బీజేపీని కూలదోస్తామని ప్రకటించాయి. అంటే.. కాంగ్రెస్, జేడీఎస్ పొత్తును విచ్చిన్నం చేద్దామనుకున్న బీజేపీ.. పని గట్టుకుని వారిని బలోపేతం చేసినట్లయింది. ఇప్పుడు కర్ణాటకలో కూటమి సాధించిన విజయాలు.. కాంగ్రెస్ పార్టీకి .. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నైతిక బలం ఇచ్చే పరిస్థితులు వచ్చాయి. ఈ పరిణామాలు చూసి.. బీజేపీ నేతలు.. కూలీ ఇచ్చి కొట్టించుకున్నట్లు అయిందని మథనపడుతున్నారు.