ఇతర రాష్ట్రాల సంగతేమో కానీ బెంగాల్లో మాత్రం బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని టచ్ చేయలేకపోతోంది. తాజాగా ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా విజయం సాధించలేకపోయింది. అసలు విజయం దరిదాపుల్లోకి కూడా రాలేదు.అంటే గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. ఆరు స్థానాల్లో మూడు స్థానాల్లో మూడో స్థానంలో నిలిచారు.
బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేస్తుందన్నంత హడావుడి జరిగింది. కానీ గెలవలేదు. తృణమూల్ పార్టీ నేతలందర్నీ పార్టీలో చేర్చుకున్నా బీజేపీకి విజయం దక్కలేదు. మమతా బెనర్జీ పార్టీకి అత్యంత ముఖ్య నేతగా సువేందు అధికారిని బీజేపీలో చేర్చుకుని ఆయననే ప్రధాన ఫేస్‌గా మార్చుకున్నా వారి రాత మారడం లేదు. ఉపఎన్నికల ఫలితాలతో బీజేపీ పరిస్థితి బెంగాల్లో మరింత దిగజారినట్లయింది.
బెంగాల్ మొదటి నుంచి సిద్దాంతపరంగా బలమైన భావజాలంతో ఉంది. కమ్యూనిస్టులు అక్కడ పెత్తనం చేశారు. తర్వాత వారిని ఎదిరించి మమతా బెనర్జీ పీఠం అందుకున్నారు. ఆమె అప్రతిహత విజయాలు సాధిస్తూ వస్తున్నారు. కమ్యూనిస్టులు ఓడిపోయిన తర్వాత బలం కోల్పోయారు. కానీ పూర్తిగా కాదు. దాంతో బీజేపీ విజయాలకు దూరంగా ఉండిపోతోంది. మమతా బెనర్జీ విజయాలకు కమ్యూనిస్టుల వైపు నుంచి చీలిపోతున్న ఓట్లు కీలకంగా మారుతున్నాయి.