ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలనుకుంటున్న బీజేపీ ఆల్ ఫ్రీ మేనిఫెస్టోను ప్రకటించింది. ఉచితాలకు తాము వ్యతిరేకం అని చెప్పుకునే బీజేపీ .. తాము ప్రకటిస్తున్నవి మాత్రం సంక్షేమం అని చెప్పుకుంటోంది. మేనిఫెస్టోలో పథకాలన్నీ ఇలాంటివే. మహిళలకు నెలకు రూ.2500, 500 రూపాయలకు సిలిండర్ , హోలీ, దీపావళి నాడు సంవత్సరానికి రెండు ఉచిత సిలిండర్లు, గర్భిణీ స్త్రీలకు రూ.21 వేల ఆర్థిక సాయం, రూ. 10 లక్షల బీమా చేయిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
60-70 సంవత్సరాల వయస్సు గల సీనియర్ సిటిజన్లకు రూ.2000కి బదులుగా రూ.2500 పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. 70 ఏళ్లు దాటిన వృద్ధులు, వితంతువులకు రూ. 3000 ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే అన్న క్యాంటీన్ల తరహాలో ఢిల్లీలోనూ క్యాంటీన్లు పెట్టాలని నిర్ణయించారు. అన్ని మురికివాడల్లో రూ.5కే పూర్తి భోజనం అందించడానికి అటల్ క్యాంటీన్ పథకాన్ని ప్రారంభిస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. అంతే కాదు.. కేజ్రీవాల్ సర్కార్ అమలు చేస్తున్న ఏ ఒక్క పథకాన్ని ఆపబోమని అంటున్నారు.
ఉచిత హామీల్లో ఆప్ కూడా పోటీ పడుతోదంి. ఉచిత విద్యుత్, నీరు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను కొనసాగిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో చెప్పింది. దీనితో పాటు మహిళలకు ప్రతి నెలా రూ.2100 ఆర్థిక సహాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచిత చికిత్స అందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్, ఉచిత రేషన్ కిట్, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఢిల్లీ ప్రజలకు హామీ ఇచ్చింది.