తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలో హైలెట్ కానున్న అంశం పేర్ల మార్పిడి. బీజేపీని గెలిపించి చూడండి.. మీ ఊరు పేరు తెల్లారేసరికి మారిపోకపోతే అప్పుడు అడగండి పద్దతిలోమేనిఫెస్టోలో హామీని చేర్చబోతున్నారు. హైదరాబాద్ దగ్గర నుంచి తెలంగాణలో ముస్లింల పేర్లు స్ఫురించి ప్రతి ఊరి పేరును మార్చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇవ్వబోతున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్ని ప్రకటించింది. అలాగే అన్ని వర్గాలకు డిక్లరేషన్లు ప్రకటించి ప్రజల్లోకి వెళ్తోంది.
బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ గ్యారంటీల్ని మరికొంత పెంచి తమ భరోసా అని ప్రజల్లో ప్రచారం చేసుకుంటోంది. కానీ ఇప్పటి వరకూ బీజేపీకి మేనిఫెస్టో లేదు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ పార్టీ మారిపోయారు. దీంతో ఆ పని ఆగిపోయింది. ఎలాగోలా పూర్తి చేసి.. పదిహేడో తేదీన అమిత్ షా చేతుల మీదుగా విడుదల చేయాలని డిసైడయ్యారు. ఇందులో పేర్ల మార్పు హామీ కీలకమంటూ.. బీజేపీ నేతలు మీడియాకు లీకులిచ్చారు. అలా అని ప్రజాకర్షక హామీలకు లోటేమి ఉండదు. మధ్యప్రదేశ్ లో గ్యాస్ సిలిండర్ రూ. 450కే ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ కూడా అలాంటి హామీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎందుకంటే.. ఐదు వందలకు ఇస్తామని కాంగ్రెస్.. నాలుగు వందలకే ఇస్తామని బీఆర్ఎస్ పోటీ పడి హామీలు ఇచ్చాయి. మరి బీజేపీ కూడా జోక్యం చేసుకోవాలి కదా.. మధ్యంగా నాలుగు వందల యాభైకి ఫిక్సయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు పార్టీల హామీల్ని కాచివడబోసి. ప్రజాకర్షక పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఖర్చేమీ ఉండని పేర్ల మార్పు మాత్రం హైలెట్ కానుంది.