తెలుగుదేశం,భారతీయ జనతా పార్టీల మధ్య నెలకొన్న విబేధాలు మరోసారి భగ్గుమ న్నాయి. ఈ సారి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో సాక్షాత్తు మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఈ విబేధాలు తారా స్థాయికి చేరాయి. జన్మభూమి వేదికగా ఇది చోటు చేసుకోవడం విశేషం. తాడే పల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెం గ్రామంలో బుధవారం జన్మభూమి గ్రామసభ జరిగింది. ఈసభలో మంత్రి మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఆయనకు పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గానికి మధ్య విబేధాలుఉన్న సంగతి తెలిసిందే.
దాంతో మంత్రి జన్మభూమి సభలో మాట్లాడుతూ “‘మూడున్నరేళ్లలో రామన్నగూడెంలో ఏ ప్రారంభోత్సవానికైనా నన్ను పిలిచారా? ఎందుకీ శత్రుత్వ ధోరణి? నేను వైసీపీ నుంచి వచ్చానా? నన్నే అంటరానివాడిగా చూసే దౌర్భాగ్య పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. నన్ను నిలదీసే పరిస్థితి వస్తే ప్రభుత్వాన్నే నిలదీస్తా. నన్ను కట్ చేయాలని ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్‌ను కూడా కట్ చేస్తా.. చాలా స్పష్టంగా చెబుతున్నా, సహనానికి హద్దులు ఉంటాయి” అని మాణిక్యాలరావు ఘాటుగా, తీవ్రంగా స్పందించారు.
అయితే అటు టిడిపినేతలు కూడా దీటుగా స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్,తెలుగుదేశం నేత ముళ్లపూడి బాపిరాజు వర్గం మాణిక్యాలరావు వ్యాఖలని ఖండించింది. దమ్ముంటే మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఆ వర్గం మాణిక్యాలరావు ను సవాల్ చేసింది.