మనుగోడులో ఎన్నికలు..వేలు, లక్షల కోట్ల చుట్టూనే తిరుగుతున్నాయి. మునుగోడులో ఉపఎన్నిక 18వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం వచ్చిందని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూంటే… ప్రజల భూములు నొక్కేసి 18 లక్షల కోట్ల స్కాం చేశారని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే ఇద్దరూ కామన్‌గా పద్దెనిమిది మీదే ఫిక్సయిపోయారు. ఒకరిది వేల కోట్ల లెక్క.. ఇంకొకరిది లక్షల కోట్ల లెక్క. ఈ లక్షల కోట్ల లెక్కలకు మునుగోడులో నీళ్లలా డబ్బులు ఖర్చు చేస్తున్న నేతల తీరు మరింత ఆజ్యం పోస్తోంది. ప్రజలు కూడా ఎన్నికలంటే ఇంత డబ్బుల వ్యవహరమా అని చర్చించుకుంటున్నారు.
బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఆరోపణలు రాజగోపాల్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తనకెలాంటి కాంట్రాక్టులు రాలేదని ఆయన చెప్పుకుంటే రాజకీయ ఆరోపణలు లాగానే ఉండేవి. కానీ తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 18వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని ఒప్పుకున్నారు. అయితే తనకు ఓపెన్ బిడ్డింగ్లోనే వచ్చాయంటున్నారు. కానీ టీఆర్ఎస్ మాత్రం ఆయనే ఒప్పుకున్నారని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. దీనికి కౌంటర్ గా రాజగోపాల్ రెడ్డి.. ధరణి వెబ్ సైట్ ను అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్ కుటుంబం 18 లక్షల ఎకరాలను ఆక్రమించుకుని.. 18 లక్షల కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చేసిందని అంటున్నారు. సీబీఐ విచారణ చేయాలంటున్నారు.
రెండు పార్టీలు 18 అంకెను బేస్ చేసుకునే ఆరోపణలు చేసుకుంటున్నాయి. వేలు, లక్షలు మాత్రమే తేడా. అన్నీ కోట్లే. అయితే పదదెనిమిదే ఎందుకో రెండు పార్టీల నేతలకు తెలియడం లేదు. రెండు పార్టీల నేతలు ఒకే సంఖ్యా శాస్త్రవేత్తనుకలిశారేమోనన్న సెటైర్లు పడుతున్నాయి. అయితే ఎన్నికల వరకూ ఈ ఆరోపణలు.. వీటిపై నిజాలు ఎప్పటికీ బయటకు రావు. ఎన్నికలైపోయిన తర్వాత అందరూ మర్చిపోతారు.