ఆంధ్ర ప్రదేశ్‌కు ఇచ్చిన వాగ్దానాలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నెరవేర్చకపోవడం రాజకీయ వేడికి కారణమవుతుంటే తిరుపతిలో ఆధ్యాత్మిక రాజకీయం కూడా ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నది. దేవాదాయ శాఖ బిజెపి మంత్రి మాణిక్యాల రావు చేతుల్లో వుండటం, కొండమీద కొందరు బిజెపి నేతల హవా కారణంగా ఇవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను ఇవోగా నియమించారు.తర్వాత దర్మకర్తల మండలిపైనా ఆ ప్రభావం పడింది. 80 ఏళ్లుగా టిటిడి ఈవోగా ఎపి క్యాడర్ ఐఎఎస్నే నియమిస్తుండగా మొదటిసారి ఆ వరవడి తప్పించారు.తర్వాత ఆ సింఘాల్ ద్వారా ఉద్యోగులలో 45 మందికి అన్యమతస్తులనే పేరిట నోటీసులు ఇప్పించారు. ఉద్యోగంలో చేరేప్పుడే వారితో నిబంధనలకు కట్టుబడి వుంటామని విశ్వాసంగా సేవ చేస్తామని ప్రమాణం చేయిస్తారు. అలాటివారిని అర్థంతరంగా తీసేయడం ఏం న్యాయమని సంఘాలు నిరసిస్తున్నాయి. దీనిపై టివీలో మాట్లాడ్డం చూసి విజయవాడలో కనకదుర్గ ఆలయంలోనూ 25 ఏళ్ల సర్వీసుగల సూపరెండెంటును తొలగించిన ఉదంతం నాకు వాట్సప్‌లో పంపించారు. ఇదంతా లేనిపోని వివాదాలకు సమస్యలకు దారితీస్తున్నది. టిటిడి చైర్మన్‌గా యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టాసుధాకర్ను నియమించాలని సంకల్పిస్తే ఆయన క్రైస్తవ మహాసభలకు హాజరైనాడని మరో వివాదం తీసుకొచ్చారు. ఈ విధంగా ప్రతి విషయంలోనూ కొత్త కొత్త సమస్యలు తీసుకురావడమే గాక భక్తుల దర్శనాలు పూజాదికాల విషయంలోనూ నిబంధనలు మార్పించేందుకు జీవోలు తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై సిబ్బంది అధికారులు భక్తులే గాక టిడిపి వర్గాలు కూడా అసంతృప్తిగా వున్నాయి. త్వరలోనే చైర్మన్ నియామకంపై నిర్ణయం తీసుకుని ఈ పరిస్థితి మార్చాలని భావిస్తున్నారట.