కర్ణాటకలో మూడు పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఏపీలో ఖాళీగా ఉన్న ఐదు పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికలు ప్రకటించకపోవడం.. ఎలా చర్చనీయాంశం అయిందో.. కర్ణాటకలో షెడ్యూల్ ప్రకటించడం కూడా అంతే చర్చనీయాంశం అయింది. ఎందుకంటే.. ఇంకా ఉంది.. పదవి కాలం ఆరు నెలలు మాత్రమే. ఎన్నికల ప్రక్రియ ముగిసే సరికి అది ఐదు నెలలకు వస్తుంది. ఐదారు నెలల పదవి కాలానికి కేంద్రం ఎందుకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిందనేది.. చాలా మందిని ఆశ్చర్యపరిచే విషయం. కానీ దీని వెనుక బీజేపీ చాలా పెద్ద లెక్కలే వేసుకుంది. కర్ణాటక రాజకీయాల్లో మలుపు తిప్పాలని నిర్ణయించుకుంది.
కాంగ్రెస్, జేడీఎస్ కలసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయనే కానీ… రోజువారీగా… వారి మధ్య సత్సంబంధాలు మాత్రం లేవు. నాలుగు నెలల కాలంలో.. వారి ప్రభుత్వం కూలిపోతోందని… రోజులు దగ్గర పడ్డాయని.. ప్రచారం జరగని రోజు లేదు. దిన దిన గండం.. నూరేళ్లాయుష్షుగా బండి నడుస్తోంది. మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. వారు పొత్తు పెట్టుకోలేదు. ఎవరికి వారు పోటీ చేశారు. ఎవరి బలాన్ని వారు నిలుపుకున్నారు. అలాంటిది..ఉపఎన్నికలు వస్తే.. రెండు పార్టీలు కలుస్తాయా..?. మూడు పార్లమెంట్ స్థానాల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన.. యడ్యూరప్ప, శ్రీరాములు తమ ఎంపీ స్థానాలయిన షిమోగా, బళ్లారి స్థానాలకు రాజీనామా చేశారు. వీటితో పాటు.. మాండ్యా స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది. షిమోగాలో.. బీజేపీ తరపున యడ్యూరప్ప కుమారుడు పోటీ చేస్తారు. బళ్లారి తరపున శ్రీరాములు ఎవరు చెబితే వారు నిలబడారు. మాండ్యాలలో ఎలాంటి బలం లేకపోయినా కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ అవకాశాల్ని రెడీ చేసి పెట్టుకుంది.
మాండ్యాలో ప్రధాన ప్రత్యర్థులు.. కాంగ్రెస్, జేడీఎస్ మాత్రమే. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ హీరోయిన్ రమ్య.. అలియాస్ దివ్య స్పందన .. కేవలం ఐదు వేల ఓట్ల తేడాతో.. జేడీఎస్ చేతిలో పరాజయం పాలయింది. ఇది తమ సిట్టింగ్ స్థానం కాబట్టి.. తమకు ఇచ్చేయాలని దేవేగౌడ పట్టుబడుతున్నారు. కానీ కాంగ్రెస్‌లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జేడీఎస్‌కు మద్దతిస్తే.. తమ పార్టీకి పుట్టగతులు ఉండవని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్ని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ ప్లాన్లు సిద్ధం చేసుకుంది. షిమోగా, బళ్లారిలోమాత్రం.. జేడీఎస్‌కు అంత బలం లేదు కాబట్టి… కాంగ్రెస్ పార్టీనే పోటీ చేసే అవకాశం ఉంది. కానీ ఆరు నెలల పదవి కాలానికి భారీగా ఖర్చు పెట్టే అభ్యర్థుల కోసం వెదుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.