వచ్చేనెల, అంటే సెప్టెబర్ 17న తెలంగాణ విమోచన దినం ఉంది. ఎప్పుడో ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాట సమయంలో దీని గురించి తెరాస మాట్లాడుతుండేది. ప్రత్యేక రాష్ట్రంలో అధికారికంగా విమోచన దినం జరిపిస్తామని, ప్రతీయేటా ప్రభుత్వమే కార్యక్రమాలు చేపడుతుందని అప్పట్లో కేసీఆర్ చెప్పేవారు. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత దాని గురించి పట్టించుకోవడం మానేశారు. అదిగో… విమోచన దినాన్ని కేసీఆర్ పట్టించుకోవడం లేదంటూ భాజపా విమర్శలు చేయడం, అధికార పార్టీ నుంచి స్పందన ఉండకపోవడం రొటీన్ గా మారిపోయింది. అయితే, ఈ నేపథ్యంలో వచ్చే నెల 17న భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో ఉంది భాజపా.
రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ… బీజేపీని కట్టడి చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ భావిస్తున్నారనీ, అది వారి వల్ల సాధ్యమయ్యేది కాదన్నారు. భాజపా సభ్యత్వాల నమోదును చూసి.. తెరాస, కాంగ్రెస్ పార్టీలు భయపడుతున్నాయన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని భాజపా అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నామనీ, ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పిలుస్తున్నామని లక్ష్మణ్ ప్రకటించారు. ప్రతీయేటా విమోచన దినం జరిపించే బాధ్యతను ఇకపై భాజపా తీసుకుంటుందన్నారు.
సెప్టెంబర్ 17 దగ్గర పడుతోందనగానే ప్రతీయేటా భాజపా నేతలు వరుసగా కొద్దిరోజులు ప్రెస్ మీట్లు పెట్టడం, కేసీఆర్ మీద విమర్శలు చేయడం వరకూ మాత్రమే పరిమితం అవుతూ వస్తున్నారు. కేసీఆర్ సర్కారు కూడా ఎమ్.ఐ.ఎమ్. మనోభావాలు దెబ్బతింటాయేమో అనే ఉద్దేశంతో ఈ టాపిక్ జోలికి వెళ్లకుండా ఉండేవారు. కానీ, ఇప్పుడు భాజపా దీన్ని రాజకీయాంశంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో బలాన్ని పెంచుకునే క్రమంలో ఉన్నారు కాబట్టి, ఈ విమోచన దినాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఆరంభించింది. దొరికిన సెంటిమెంట్స్ ని కచ్చితంగా వాడుకుంటుంది. మరి, విమోచన దినం నిర్వహించడానికి తామూ వ్యతిరేకం కాదు అనే విధంగా కేసీఆర్ స్పందిస్తారా లేదా అనేది చూడాలి.