ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన కారణంగా మార్చి 27న రాష్ట్రపతి పాలన విధించబడింది. దానిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రజాస్వామ్యబద్ధంగ ఎన్నికయిన తన ప్రభుత్వాన్ని భాజపా కుట్రలు పన్ని కూల్చివేసి రాష్ట్రపతి పాలన విధించిందని రావత్ ఆరోపిస్తున్నారు.
భాజపా జాతీయ అధికార ప్రతినిధి అనిల్ బౌలాని ఆ ఆరోపణలను ఖండిస్తూ “హరీష్ రావత్ అసమర్థత కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుగుబాటు జరిగింది కానీ హరీష్ రావత్ అందుకు మమ్మల్ని నిందించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తన ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను డబ్బులు చెల్లిస్తున్నపుడు మీడియా తీసిన స్టింగ్ ఆపరేషన్ వీడియోని దేశంలో ప్రజలందరూ చూసి రావత్ ఎటువంటివారో అర్ధం చేసుకొన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన తరువాత రావత్ అవినీతి పరిపాలన అంతమయినందుకు ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మంచిదా లేకపోతే మళ్ళీ ఎన్నికలు నిర్వహించి ప్రజా తీర్పు కోరడం మంచిదా అని చర్చిస్తున్నాము. రాష్ట్ర ప్రజలు ఏమి కోరుకొంటే అదే చేస్తాము. ఏదయినా మాకు అభ్యంతరం లేదు,” అని అనిల్ బౌలానీ చెప్పారు.
ఉత్తరాఖండ్ శాసనసభలో మొత్తం 70 స్థానాలున్నాయి. వాటిలో 28 మంది భాజపా సభ్యులున్నారు. వారికి హరీష్ రావత్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మరో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జత కలిసారు కానీ వారిపై అనర్హత వేటు పడింది కనుక వారి వలన భాజపాకి ఉపయోగం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకి కనీసం 36మంది ఎమ్మెల్యేలు అవసరం. అంటే భాజపాకి కనేసం మరో 8 మంది మద్దతు అవసరం. శాసనసభలో బీ.ఎస్.పి.కి-2, యు.కె.డి.(పి)-1, స్వతంత్రులు-3 మంది ఎమ్మెల్యేలున్నారు. వారందరూ హరీష్ రావత్ కే మద్దతు ఇస్తున్నారు. కనుక భాజపా స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు.
అడ్డుదారిలో అధికారం చేజిక్కించుకొనేందుకు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయిన హరీష్ రావత్ ప్రభుత్వాన్ని కూల్చివేసిందనే తీరని అప్రదిష్ట మూటగట్టుకొన్నా ఫలితం దక్కలేదు. కనుక ఈ వేడి కొంచెం చల్లారే వరకు ఆగి, ఈలోగా మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దపడవచ్చును.
మరి అటువంటప్పుడు ఎన్నికలకి వెళ్ళాలనుకొంటున్నట్లు ఎందుకు చెప్పడం అంటే, రావత్ కి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలని తమవైపు తిప్పుకోవడానికేనని చెప్పవచ్చు. ఇంకా పదవీకాలం ముగియక మునుపే ఏ ఎమ్మెల్యే కూడా మళ్ళీ ఎన్నికలకి వెళ్లాలని కోరుకోడు. ఎన్నికలని ఎదుర్కోవడం, దానికయ్యే ఖర్చు భరించడం ఎవరికయినా కష్టమే. తీరా ఎంత ఖర్చు చేసినా గెలుస్తామో లేదోననే అనుమానం ప్రతీ ఎమ్మెల్యేకి ఉంటుంది. కనుక ఎన్నికలంటే అందరికీ భయమే. అందుకే వారిని ఎన్నికల పేరు చెప్పి భయపెట్టి భాజపా తనవైపు తిప్పుకోవాలని ఆలోచిస్తున్నట్లుంది తప్ప నిజంగా ఎన్నికలకి వెళ్ళే ఉద్దేశ్యంతో మాత్రం కాదని చెప్పవచ్చు. ఒకవేళ నిజంగా ఎన్నికలకి వెళ్ళినట్లయితే హరీష్ రావత్ పట్ల ప్రజలు సానుభూతి చూపే అవకాశాలు ఎక్కువ కనుక భాజపాకే ఎదురుదెబ్బ తగలవచ్చు.